మామూలు(Simple) రనప్… బంతుల్లో వైవిధ్యం(Diversity)… చూస్తే బక్కపలచని మనిషి. కానీ.. భారత క్రికెట్ కు అతనో ఆణిముత్యం. ఏ బాల్ ఎటువైపు దూసుకొస్తుందో… ఎక్కడ పడి ఎటు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ వికెట్. రెండో టెస్టులో భాగంగా ఈ పేస్ బౌలర్ నుంచి రిలీజ్ అవుతున్న సందర్భంలో బాల్.. వైడ్ గా వెళ్తున్నట్లు వీడియోల్లో రికార్డయింది. కానీ ఆ బంతి కాస్తా వైడ్ గా కాకుండా అనూహ్య రీతిలో స్వింగ్ అయి లోపలికి చొచ్చుకెళ్లింది. ఇంకేముంది… మిడిల్, లెగ్ వికెట్లు లేచిపోవడం, బెయిల్స్ గాల్లో ఎగరడం జరిగిపోయాయి. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ అయ్యాయి. అంతటి ఘనతను మూటగట్టుకున్న ఆ మిస్టరీ బౌలరే జస్ ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah).
వరల్డ్ నంబర్ వన్…
ఇంగ్లండ్ తో విశాఖ(Vizag)లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసిన బుమ్రా… ప్రపంచ టెస్టు క్రికెట్(World Test Cricket)లో నంబర్ వన్ గా అవతరించాడు. మూడు స్థానాలు ఎగబాకిన బుమ్రా ఏకంగా టాప్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. ఇప్పటివరకు అశ్విన్ నంబర్ వన్ గా ఉంటే అతణ్ని వెనక్కు నెట్టి బుమ్రా ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకు బుమ్రా అత్యుత్తమ ర్యాంక్ నాలుగుగా ఉంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో నంబర్ వన్ గా నిలిచిన తొలి భారత(First Indian) ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు కపిల్ దేవ్ మాత్రమే రెండో ర్యాంకు వరకు చేరుకున్నాడు. 1979 డిసెంబరు నుంచి 1980 ఫిబ్రవరి వరకు కపిల్ నంబర్ టూగా ఉన్నాడు. అతడి తర్వాత జహీర్ ఖాన్ మూడో స్థానం దాకా వచ్చాడు.
ఎవరికీ అందనంత ఎత్తులో…
బుమ్రా వరల్డ్ నంబర్ వన్ గా సమీప బౌలర్లెవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మొత్తంగా ఈ సంచలన బౌలర్ కి తాజాగా విడుదల చేసిన లిస్ట్ లో 881 రేటింగ్ పాయింట్లు దక్కగా.. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ 851 పాయింట్లతో ఉన్నాడు. టాప్ టెన్ లిస్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. అశ్విన్ మూడో స్థానంలో నిలిస్తే, రవీంద్ర జడేజా పదో ప్లేస్ లో ఉన్నాడు.
Published 07 Feb 2024