మేడిగడ్డ లోటుపాట్లపై విజిలెన్స్ విచారణ(Vigilance) చేయించిన సర్కారు… అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టింది. నీటిపారుదల శాఖ(Irrigation Deprartment)లోని ఉన్నతాధికారులను తొలగించింది. రిటైర్ అయినా ఇంకా పోస్టుల్లో కొనసాగుతున్న కీలక అధికారిని రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ENC మురళీధర్ ను వెంటనే పదవికి రాజీనామా చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈయనతోపాటు రామగుండం ENCగా ఉంటూ కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పరిశీలకుడిగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పెద్దయెత్తున ప్రక్షాళన
మేడిగడ్డలో భాగమైన లక్ష్మీ బ్యారేజీ కుంగుబాటుపై ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై మరికొందరు అధికారుల(Engineers)పైనా వేటు పడబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కార్యాలయాలపై ఈ నెల 9న సోదాలు జరిగాయి. ENC మురళీధర్ తోపాటు రామగుండం ENC ఆఫీసుల్లోనూ తనిఖీలు సాగాయి. హైదరాబాద్ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోనూ భారీగా సోదాలు చేశారు. విజిలెన్స్ SP రమణారెడ్డి నేతృత్వంలో మొత్తం 10 టీమ్ లు, ఇంజినీరింగ్ బృందాలు జరిపిన దాడుల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అసలు కథ ఇది…
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సర్కారు మూడేళ్లలో పూర్తి చేసింది. తెలంగాణ-మహారాష్ట్రను కలిపే ఈ బ్యారేజ్ వంతెన ఉన్నట్టుండి కుంగిపోయింది. అక్టోబరు 22న పెద్ద సౌండ్ తో పిల్లర్ దెబ్బతినడంతో 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఇంజినీర్లు బ్యారేజీలోని 10 TMCల నీటిని విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ పెద్దయెత్తున ఆరోపణలు చేసింది. లక్ష కోట్లకు పైగా వెచ్చించిన ప్రాజెక్టు కొద్దికాలంలోనే ప్రమాదానికి గురవడంతో న్యాయ విచారణకు కొత్త ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
Published 07 Feb 2024