కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం(Construction) నుంచి నిర్వహణ(Management) వరకు అన్ని విషయాల్లోనూ పెద్ద నిర్లక్ష్యమే చోటుచేసుకుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు(Repairs)పై ఇటు నీటిపారుదల శాఖ గానీ అటు కాంట్రాక్ట్ సంస్థ పట్టించుకోలేదని తన నివేదిక(Report) ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో ఇద్దరు ENC(ఇంజినీర్ ఇన్ చీఫ్)లు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం… మురళీధర్ ను రాజీనామా చేయాలని ఆదేశిస్తూనే వెంకటేశ్వర్లును ఉద్యోగం నుంచి తొలగించింది.
నివేదికలోని అంశాలివే…
కాంట్రాక్టరుతో చేసుకున్న ఒప్పందం విలువ నాలుగేళ్లలో 133 శాతం పెరగడం
ఎల్ అండ్ టీ-పీఈఎస్ జాయింట్ వెంచర్ కు రెండు సార్లు ఒప్పంద మొత్తాన్ని భారీగా పెంచడం
అంచనా(Estimation) కంటే 2.7 శాతం ఎక్కువతో(రూ.1,849 కోట్లకు) మేడిగడ్డ బ్యారేజీ పనులు దక్కించుకోవడం
రెండుసార్లు సవరించడం ద్వారా రూ.2,472 కోట్ల వ్యయం పెరగడం
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల విషయంలో నిపుణుల కమిటీ వేయాలని సిఫార్సు
ఈఎన్సీ రాజీనామా…
పదవి నుంచి వైదొలగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ENC మురళీధర్ రాజీనామా చేశారు. నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు హైదరాబాద్ జలసౌధలో రాజీనామాను అందజేశారు. 2013లో రిటైర్ అయిన మురళీధర్.. గత 11 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నారు.