సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీల్లో ఆస్ట్రేలియా(Australia) హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వెస్టిండీస్ తో వన్డే, టెస్టు సిరీస్ ను నెగ్గిన కంగారూలు… తాజాగా పొట్టి ఫార్మాట్ లోనూ అదే జట్టుపై శుభారంభం చేశారు. హోబర్ట్(Hobert)లో జరిగిన తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు… నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్(West Indies) 8 వికెట్లకు 202 రన్స్ వద్దే ఆగిపోయి 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
వార్నర్ దంచుడు..
ఆసీస్ బ్యాటింగ్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్(70; 36 బంతుల్లో 12×4, 1×6) ఆటే హైలెట్ గా నిలిచింది. జోష్ ఇంగ్లిస్(39), టిమ్ డేవిడ్(37) సహకరించారు. విండీస్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ 3, అల్జారీ జోసెఫ్ 2, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్ తలో వికెట్ తీసుకున్నారు. 11 రన్ రేట్ తో బరిలోకి దిగిన కరీబియన్ టీమ్ కు ఓపెనర్లు మంచి పార్ట్నర్ షిప్(Partnership) అందించినా మిడిలార్డర్ తుస్సుమనడంతో పరాజయం తప్పలేదు.
ఓపెనర్లు బ్రెండన్ కింగ్(53), జాన్సన్ ఛార్లెస్(42), జేసన్ హోల్డర్(34 నాటౌట్) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, మార్కస్ స్టాయినిస్ 2, జేసన్ బెహ్రెండార్ఫ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, సీన్ అబాట్ ముగ్గురూ ఒక్కో వికెట్ చొప్పున ఖాతాలో వేసుకున్నారు.
Published 09 Feb 2024