అప్పుడు సీనియర్లు మొదట బ్యాటింగ్ చేసినా, ఇప్పుడు జూనియర్లు టార్గెట్ ఛేదించాల్సి వచ్చినా భారత్ కు మాత్రం ఓటమి తప్పలేదు. సీనియర్ వరల్డ్ కప్ మాదిరిగానే జూనియర్ ప్రపంచ కప్పునూ భారత జట్టు(Team India) చేజార్చుకుంది. గతంలో రెండు సార్లు తమను ఓడించి కప్పు దక్కించుకున్న టీమ్ఇండియాపై యువ ఆస్ట్రేలియా(Australia) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఇలా సేమ్ టూ సేమ్(Same to Same) అన్న రీతిలో యువ భారత్.. తుది మెట్టుపై బోల్తా పడింది. లీగ్ దశ నుంచి సెమీస్ దాకా అద్భుతంగా ఆడినా… చివరి మెట్టుపై పరాభవం తప్పలేదు. 43.5 ఓవర్లలో 174 రన్స్ కు ఆలౌటై 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆరోసారి కప్పు అందుకోవాలన్న కల నెరవేరలేదు. సీనియర్ ఆస్ట్రేలియన్లు ఆనాడు అహ్మదాబాద్ లో భారత్ పై గెలిచి ఆరో కప్పును అందుకుంటే.. నేడు జూనియర్ కంగారూలు భారత్ ను ఆరో కప్పు అందుకోకుండా చేశారు.
భారీ స్కోరు కాకున్నా…
దక్షిణాఫ్రికాలోని బెనోనిలో జరుగుతున్న అండర్-19(Under-19) వరల్డ్ కప్ తుది పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూల్ని.. మొదటి నుంచి భారత బౌలర్లు కట్టడి(Control) చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఈ టోర్నీలో బాగా రాణిస్తున్న రాజ్ లింబాని.. ఈ మ్యాచ్ లోనూ అత్యంత తక్కువ రన్స్ ఇస్తూ క్రమంగా వికెట్లు తీసుకున్నాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(55) మాత్రమే ఆ టీమ్ లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా.. కెప్టెన్ హఫ్ వెబిగెన్(48), ఒలీవర్ పీక్(46) ఓపెనర్ హారీ డిక్సన్(42) రాణించారు. లింబాని 3, నమన్ తివారి 2, ముషీర్ ఖాన్, సౌమీ పాండే తలో వికెట్ చొప్పున తీసుకున్నారు.
వికెట్లు టపటపా…
భారత జట్టు ఆటతీరు చూస్తుంటే ఏ దశలోనూ టార్గెట్ సాధిస్తుందన్న ఆశ కనిపించలేదు. 91కే ఆరు వికెట్లు చేజార్చుకోగా.. 122 స్కోరు చేరుకునే సరికి 8 వికెట్లు పడ్డాయి. టోర్నమెంట్ అంతా బాగా ఆడిన కెప్టెన్ ఉదయ్ సహరన్(8), సచిన్ ధాస్(9) ఫెయిలవగా.. ఓపెనర్ ఆదర్శ్ సింగ్(47) మాత్రమే నిలబడ్డాడు. తొలి 15 ఓవర్ల వరకు ఆదర్శ్ మరీ జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ అర్షిణ్ కులకర్ణి(3), ముషీర్ ఖాన్(22), ప్రియాన్ష్ మోలియా(9)… ఇలా అందరూ వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. మెహ్లి బియర్డ్ మన్, రాఫ్ మెక్ మిలన్ పోటాపోటీగా వికెట్లు తీయడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఎనిమిదో వికెట్ గా బ్యాటింగ్ కు వచ్చి మెరుపులతో ఆశలు రేకెత్తించిన స్పిన్నర్ మురుగన్ అభిషేక్(42).. పోరాటం చేసినా భారత్ ను గట్టెక్కించలేకపోయాడు. మెహ్లి బియర్డ్ మన్, రాఫ్ మెక్ మిలన్ పోటాపోటీగా వికెట్లు తీయడంతో భారత్ కు ఓటమి తప్పలేదు.
జూనియర్ టూ సీనియర్ జర్నీ…
అండర్-19 నుంచి సీనియర్ జట్టులోకి ఎంపికయ్యే ఆటగాళ్ల పర్సంటేజ్ ను పరిశీలిస్తే.. అన్ని దేశాల కన్నా ఈ విషయంలో బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉంది. ఆ దేశ అండర్-19కు ఆడిన ప్లేయర్లలో 41 శాతం మంది సీనియర్ టీమ్ లోకి సెలెక్ట్ అవుతున్నారు. ఈ విషయంలో టీమ్ఇండియా 27 శాతంతో ఏడో స్థానంలో ఉంటే.. ఆస్ట్రేలియా కేవలం 20 శాతంతో తొమ్మిదో స్థానంలో ఉంది. అండర్-19 వరల్డ్ కప్ ను పరిశీలిస్తే అత్యధికంగా భారత్ 5 సార్లు గెలుచుకోగా… ఆస్ట్రేలియా నాలుగు, పాకిస్థాన్ రెండు సార్లు అందుకున్నాయి.
Published 11 Feb 20241