వరుస గాయాలతో(Injuries) రెగ్యులర్ గా మ్యాచ్(Matches)లకు దూరంగా ఉంటున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తాజా ఇంగ్లండ్(England) సిరీస్ లోనూ అదే తీరుతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికే రెండో టెస్టు నుంచి వైదొలిగిన అతడు.. మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండటం లేదని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సహా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాటం చేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరు బాగా ఆడటంతో భారత్ మంచి స్కోరు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరూ గాయాలపాలై ఏకంగా రెండో టెస్టుకు దూరమయ్యారు.
వస్తారని అనుకున్నా…
మూడో టెస్టుకు ఇంకా టైమ్ బాగా ఉన్నందున ఆ లోపు కోలుకుంటారని BCCI వర్గాలు ఆశతో కనిపించాయి. కానీ గాయం ఎంతకూ మానకపోవడంతో మూడో టెస్టు నుంచీ రాహుల్ వైదొలగే పరిస్థితి ఏర్పడింది. రాహుల్ స్థానంలో కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. రంజీ(Ranji)ల్లో దంచికొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ తోపాటు రజత్ పటీదార్(Rajat Pateedar).. మిగతా టెస్టుల కోసం టీమ్ లోకి ఎంటరయ్యారు. రెండో టెస్టులో సర్ఫరాజ్ కు కాకుండా సీనియారిటీ ప్రకారం పటీదార్ కు అవకాశమిచ్చారు. కానీ అతడు పరుగులు చేయకపోవడంతో మూడో టెస్టులో ఛాన్స్ దక్కడం అనుమానమే. ఇటు రాహుల్ లేక, అటు పటీదార్ సరిగా ఆడక, మరోవైపు శ్రేయస్ అయ్యర్ ను తీసుకోకపోవడం వంటి కారణాలతో… ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ కు ప్లేస్ దక్కే అవకాశాలు కనపడుతున్నాయి.
అక్షర్ కు అవకాశం…!
అక్షర్ పటేల్ రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్ లో రాణించడంతో ఆల్ రౌండర్ కోటాలో ఆయన ప్లేస్ కు ఢోకా లేదు. ఇక రెండో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కూడా రాణించాడు. రాజ్ కోట్ లో జరిగే థర్డ్ టెస్టులో కొత్త ముఖాల్లో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆశ్చర్యకరంగా మారింది.