వాహనదారులకు గుడ్ న్యూస్.. కొత్త ఎలక్ట్రిక్ కారు(Electric Car) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్(Tata Motors).. ఈవీ కార్ల ధరలను తగ్గించింది. ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో నెక్సాన్, టియాగో ఈవీ ధరలను రూ.1,20,000 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్ల తయారీలో ఉపయోగించే బ్యాటరీ సెల్ల ధరలు స్వల్పంగా తగ్గడంతో వీటి ధరలు కూడా తగ్గాయి.
అంతేకాకుండా, టాటా నెక్సాన్, టియాగో ఈవీ కార్ల ధర తగ్గింపును పొందాయి.
ఇటీవల లాంఛ్ అయిన పంచ్ ఈవీ ధరలు మాత్రం మారలేదని గమనించాలి. టాటా కార్ల ధర తగ్గింపు తర్వాత టాటా టియాగో ఈవీ భారత మార్కెట్లో రూ.7.99 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా, నెక్సాన్ ఈవీ రూ.14.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ కారు రూ.16.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
భారీగా తగ్గిన బ్యాటరీ సెల్ ధరలు :
టాటా కార్ల ధర తగ్గింపుపై కంపెనీ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. బ్యాటరీ ఖర్చులు ఈవీ మొత్తం ధరలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటాయి. బ్యాటరీ సెల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గాయి. భవిష్యత్తులో మరింత తగ్గింపులు ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఫలితంగా వచ్చే ప్రయోజనాల(Benefits)ను నేరుగా కస్టమర్లకు అందించాలని భావిస్తున్నామన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీకార్ల ధరలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని శ్రీవాస్తవ అన్నారు. ఇప్పటికే పోర్ట్‌ఫోలియో స్మార్ట్(Smart), ఫీచర్(Feature) రిచ్ కోసం అనేక రకాల బాడీ స్టైల్స్, రేంజ్, ధరల పాయింట్లను అందిస్తుందని చెప్పారు. అత్యధికంగా అమ్ముడవుతున్న Nexon.ev, Tiago.ev కార్లు… కస్టమర్లను మరింత ఆకర్షించేలా ఉన్నాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
టాటా టియాగో ధర ఎంతంటే? :
అక్టోబరు 2022లో టాటా టియాగో ఈవీ మోడల్ రూ.8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంఛ్ అయింది. టాటా టియాగో ఈవీ మోడల్.. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చింది. మునుపటిది 24kWh బ్యాటరీ ప్యాక్‌తో MIDC పరిధి 315 కి.మీ అందిస్తుంది. మరో ఆప్షన్ 19.2kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 250 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.