భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న మూడో టెస్టు(Third Test)లో విజయం కోసం ఇరు జట్లు ఇవాళ మరో సమరానికి సిద్ధమయ్యాయి. రాజ్ కోట్(Rajkot)లో ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం రెండు జట్లూ ఆల్ రౌండ్ షోపై దృష్టిపెట్టాయి. మొదటి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో భారత్ గెలుపొందడంతో ఐదు టెస్టుల సిరీస్ లో రెండు జట్లు 1-1తో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో టెస్టులో విజయం సాధిస్తే సిరీస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ పైనే దృష్టిపెడుతూ కీలక ఆటగాళ్లు రాణించాలని కోరుకుంటున్నాయి. ఈ పిచ్ కూడా స్పిన్ కు అనుకూలించే అవకాశమున్నా.. ఇలాంటి ఉపఖండ పిచ్ లపైనా భారత పేసర్ బుమ్రా ప్రతాపం చూపుతూనే ఉన్నాడు.
మిడిలార్డర్ తోనే ప్రాబ్లమ్…
విరాట్ కోహ్లి, రాహుల్ గైర్హాజరీలో టీమ్ఇండియాకు మిడిలార్డరే(Middle Order) సమస్యగా మారింది. సీనియర్లు లేకపోవడంతో కొత్త కుర్రాళ్లపైనే ఆధారపడాల్సి వస్తున్నది. రెండో టెస్టులో రజత్ పటీదార్ కు ఛాన్స్ దక్కినా అతడు పెద్దగా ఆడలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ను తీసుకునే అవకాశం ఉంది. పటీదార్ తోపాటు సర్ఫరాజ్ సైతం ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కీపర్ కేఎస్ భరత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కు చోటు దక్కనున్నట్లు తెలుస్తున్నది. ఆడిన మ్యాచ్ ల్లో ఏ మాత్రం ప్రభావం చూపని భరత్.. ఏ ఒక్క మ్యాచ్ లోనూ పెద్దగా ఆడిందిలేదు.
విశేషాలివిగో…
ఈ టెస్టు మ్యాచ్ పలు రికార్డులకు వేదిక కాబోతున్నది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు ఇది వందో టెస్టు. అటు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే.. 500 వికెట్ల క్లబ్ లో చేరతాడు. ఇంకో 5 వికెట్లు తీసుకుంటే ఇంగ్లిష్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. విశాఖపట్నం మాదిరిగానే రాజ్ కోట్ లోనూ రివర్స్ స్వింగ్ తో బుమ్రా చెలరేగుతాడని మాజీలు అంటున్నారు.