అధికారంలో ఉన్నంత కాలం అందరూ దగ్గర చేరారు. కానీ ఇప్పుడా అధికారం కోల్పోయాక.. అంతా ఒక్కరొక్కరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం(Opposition)గా మారిన గులాబీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ లీడర్లను, కార్యకర్తల్ని కాపాడుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నా… అధికార పార్టీలోకి జంప్ కావడాన్ని ఆపలేకపోతున్నారు. గతంలో ఏ పార్టీ నుంచయితే వచ్చారో ఇప్పుడదే పార్టీలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు.
మాజీ మంత్రి కుటుంబం…
BRS అధికారంలో ఉన్నప్పుడు పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి వరుసగా రెండోసారి టికెట్ ఇచ్చుకున్న గులాబీ పార్టీ… అక్కడ మహేందర్ రెడ్డిని కాదనలేక ఆయన MLC పదవిని సైతం కట్టబెట్టి తర్వాత కూడా మంత్రి పదవి అప్పజెప్పింది. ఇప్పుడాయన సతీమణి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. సునీత ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్(ZP) ఛైర్మన్ గా ఉన్నారు. ఆమె తన BRS ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను మీ పార్టీని వీడుతున్నానంటూ KCRకు లెటర్ పంపించారు.
తాండూరులో తాడోపేడో అన్నట్లు…
వికారాబాద్ జిల్లా తాండూరులో రెండు వర్గాల మధ్య హోరాహోరీ ఫైట్ ఏర్పడింది. 2019 ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి గెలిచిన తర్వాత రెండు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ప్రత్యర్థులిద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో ఇరు క్యాడర్ల మధ్య గల అంతర్గత గొడవలు క్రమంగా బయట దాకా వచ్చాయి. అటు మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి సైతం వివిధ మీటింగ్ ల్లోనే బాహాటంగా వాదులాడుకున్న సందర్భాలున్నాయి. ఒక్క తాండూరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చాలా సెగ్మెంట్లలోనూ రెండు వర్గాలు ఏర్పడినా BRS అధినాయకులు పెద్దగా పట్టించుకోలేదు.
రాష్ట్రంలోని మెజార్టీ సెగ్మెంట్లలో…
సయోధ్య కుదుర్చుతామన్న ధీమాను అధికారంలో ఉన్నన్నాళ్లూ కనబరిచినా.. ఆ ఎఫెక్ట్ మాత్రం ప్రభుత్వం నుంచి దిగిపోయాక పార్టీపై పడుతున్నది. గతంలో GHMC మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ మొన్నటివరకు KTRకు కీలక అనుచరుడిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీని వీడి… సతీసమేతంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇలా రెబల్ బెడద గల నియోజకవర్గాలు BRSకు పెద్దసంఖ్యలో ఉండగా.. ఇంకా మరెంతమంది పార్టీ వీడతారో చూడాల్సి ఉంది.