రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల్లో(Six Guarantees) మరో ముఖ్యమైన పథకం(Scheme) గృహజ్యోతి. పేద కుటుంబాల్లో ఇంటింటికి 200 యూనిట్ల చొప్పున కరెంటు ఉచితంగా ఇస్తామన్నది హస్తం పార్టీ మేనిఫెస్టో లక్ష్యం. మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి పథకాలతో కూడిన అభయహస్తం గురించి మొన్నటి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి రెండు నెలల దాటిపోయింది. ఇచ్చిన హామీల్ని 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని ప్రకటించి ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Journey) అమలు చేస్తుండగా త్వరలోనే గృహజ్యోతిని అమలు చేయబోతున్నారు.
ఆధార్ కార్డు చూపిస్తేనే…
గృహజ్యోతి పథకాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.2,418 కోట్లు కేటాయించింది. అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలుపెట్టిన అధికారులు.. సరైన ఆధారాలు(Proofs) చూపించాలని అడుగుతున్నారు. అయితే పలు చోట్ల ఇబ్బందులు ఏర్పడుతుండటంతో లబ్ధిదారులు… ఆధార్(Aadhaar) కార్డుల్ని కచ్చితంగా చూపించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహజ్యోతి లబ్ధిదారులకు ఆధార్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.