హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అంటే అందరికీ తెలుసని అలాంటి దవాఖానాలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశ్చర్యపోయారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆమె.. పేషెంట్స్ కు బెడ్స్ లేక అవస్థలు పడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓల్డ్ బిల్డింగ్ లో అసలు రోగులే లేరని అక్కడి ఆఫీసర్లు చెప్పగా.. సరైన స్థలం లేకనే ఒక్కో బెడ్ పై ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్ ఉంటున్నారని తమిళిసై ఆవేదన చెందారు.
టాయిలెట్స్ అయితే మరీ దారుణమని, వాటికి డోర్స్ కూడా లేకపోవడం కన్నా బాధాకరమైన విషయం మరోటి ఉండదన్నారు గవర్నర్. కొత్త బిల్డింగ్ కట్టాలని ప్రభుత్వానికి సూచించి.. అప్పటివరకు ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలో ఆలోచించాలన్నారు. ‘రోజుకు 2 వేల మంది పేషెంట్లు ఉస్మానియాకు వస్తున్నారు.. రోజూ 200 సర్జరీలు జరిగే హాస్పిటల్ కట్టి వందల సంవత్సరాలవుతోంది.. దవాఖానా అభివృద్ధి విషయంలో కోర్టు ఇంట్రెస్ట్ చూపినందుకు అభినందిస్తున్నాను.. నేను ఎవరినీ తప్పు పట్టేందుకు ఉస్మానియాకు రాలేదు’ అంటు తమిళిసై వివరించారు.
ఈ పర్యటనపై ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్న గవర్నర్… పేషెంట్స్ కు బెస్ట్ ట్రీట్మెంట్ అందాలనేదే తన లక్ష్యమన్నారు. లీగల్ ఇష్యూ అని చెప్పి సర్కారు చేతులు దులుపుకోకూడదని.. ఫాస్ట్ గా బిల్డింగ్ కట్టాలని చెప్పడం రాజకీయం అవుతుందా అని ప్రశ్నించారు. తనకు సమస్యల గురించి చెప్పే హక్కు లేదా అంటూ తనను ప్రశ్నించడానికి బదులుగా సమస్యకు పరిష్కారం చూపితే బాగుంటుందని అన్నారు.