ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. విశ్వాస పరీక్ష(Confidence Motion)లో విజయం సాధించారు. తనకు తానే విశ్వాస పరీక్ష నిర్వహించుకున్న ఆయన.. మెజార్టీ సభ్యుల మద్దతు పొందారు. 70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ నకు 62 మంది శాసనసభ్యులు(MLA’s) ఉన్నారు. మిగతా 8 మంది BJPకి చెందిన సభ్యులు. ఆయన పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.
ఈడీ సమన్లతోనే…
కేజ్రీవాల్ సర్కారుకు పూర్తి మెజారిటీ ఉన్నా మరోసారి విశ్వాస పరీక్ష వైపు మొగ్గుచూపారు. లిక్కర్ కేసులో ఇప్పటికే ఆయనకు పలుసార్లు ED నోటీసులు పంపింది. స్పందించని ఆయన.. విచారణకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనిపై ED.. కోర్టులో సవాల్ చేసింది. అటు తనకు సమన్లు రాకుండా చూడాలంటూ వేసిన పిటిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఇద్దరు AAP MLAలను రూ.25 కోట్ల చొప్పున కొనడానికి BJP చూస్తుందంటూ గతంలో CM ఆరోపణలు చేశారు. అలాంటిది అదే పార్టీకి చెందిన ఒక సభ్యుడు విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేయడం ఆశ్చర్యంగా మారింది.
మెజారిటీ ఉన్నా విశ్వాస పరీక్ష ఎందుకు…
అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం BJP వ్యతిరేక ముఖ్యమంత్రుల్లో నంబర్ వన్ గా ఉన్నారు. మమతా బెనర్జీ ఆ ప్లేస్ లో ఉన్నా ఈ మధ్య కాస్త తగ్గడంతో కేజ్రీవాలే కాషాయ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారారు. లిక్కర్ స్కామ్ బయటపడనంత వరకు కేజ్రీవాల్ సచ్ఛీలుడుగానే మన్ననలు అందుకున్నారు. కానీ ఎప్పుడైతే అది వెలుగుచూసిందో అప్పట్నుంచీ ఆమ్ ఆద్మీపై అనుమానాలు ఏర్పడ్డాయి. మోదీ సర్కారును ఎదుర్కోవాలంటే విమర్శలే కాదు.. నీతిమంతగా ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుందన్నది కాదనలేని నిజం. కానీ ఈ చిన్న లాజిక్ మర్చిపోయిన కేజ్రీవాల్.. లిక్కర్ స్కామ్ ద్వారా కేంద్రానికి అవకాశం ఇచ్చినట్లయింది.
CM, డిప్యుటీ CM లేకుంటే…
డిప్యుటీ CM మనీశ్ సిసోడియా జైలు పాలు కావడం, ఈ స్కామ్ లో తెలంగాణ, AP రాష్ట్రాలకు చెందిన బడా నేతలు, వ్యాపారుల పాత్ర ఉండి అందులో కొందరు అరెస్టవడంతో ఢిల్లీ సర్కారుపై విమర్శలు మొదలయ్యాయి. విపక్ష ఇండియా కూటమిలో ఎంత చెబితే అంత అన్న తీరు నుంచి కేజ్రీవాల్ గ్రాఫ్ పడిపోయింది. ED సమన్లకు హాజరైతే ఆయన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే తమ పార్టీ పరిస్థితి అయోమయంగా మారుతుంది. CM, డిప్యుటీ CMలు జైళ్లల్లో ఉంటే పార్టీని కాపాడేదెవరు అన్న సంశయం రావడం సహజమే. కాబట్టి ఇప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించుకుని తాము బలంగానే ఉన్నట్లు ఎదురుదాడి చేయడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇందుకు సిద్ధమైనట్లు అర్థమవుతున్నది.