రాజ్ కోట్ లో జరుగుతున్న టెస్టులో భారత యువ ప్లేయర్లు ఇంగ్లండ్ భరతం పట్టారు. జైస్వాల్, గిల్, సర్ఫరాజ్ వన్డే తరహా(ODI Style) ఆటతీరుతో చుక్కలు చూపించారు. ఓపెనర్(Young Opener) యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ ను చితక్కొట్టి మూడో టెస్టు నాలుగో రోజు మరో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లోనూ అతడు ద్విశతకం చేసిన సంగతి తెలిసిందే. జైస్వాల్(214 నాటౌట్; 236 బంతుల్లో 14×4, 12×6) సిక్స్ లు, ఫోర్లతో హోరెత్తించాడు. శుభ్ మన్ గిల్(91; 151 బంతుల్లో 9×4, 2×6) కొద్దిలో సెంచరీ కోల్పోతే… అటు సర్ఫరాజ్ ఖాన్ సైతం వరుసగా రెండో హాఫ్ సెంచరీ(68 నాటౌట్; 72 బంతుల్లో 6×4, 3×6)తో రఫ్పాడించాడు.
డిక్లేర్డ్…
తొలి ఇన్నింగ్స్ లో 126 పరుగుల లీడ్ సాధించిన టీమ్ఇండియా.. సెకండ్ ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 430 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ప్రత్యర్థి ముందు 557 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. నిన్న సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిన జైస్వాల్.. ఈరోజు మరోసారి క్రీజులో అడుగుపెట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ ఎడాపెడా సిక్స్ లు, ఫోర్లతో హడలెత్తించాడు. జైస్వాల్-గిల్, యశస్వి-సర్ఫరాజ్ జోడీని విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ జట్టుకు సాధ్యం కాలేదు.
రికార్డుల హీరో…
వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన ఘనతను పొందిన జైస్వాల్… ఆ రికార్డు సాధించిన మూడో భారత ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. అంతకుముందు వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లి కంటిన్యూగా ‘డబుల్’ డబుల్ సెంచరీలు సాధించారు. ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ 400కు పైగా స్కోర్లు సాధించడం భారత్ కు ఇది మూడో సారి. ఇక ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు బాది ద్విశతకాన్ని అందుకున్న క్రికెటర్ గా జైస్వాల్ వరల్డ్ రికార్డును సమం(Equal) చేశాడు. జింబాబ్వేపై 1996లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్ 12 సిక్స్ లతో 257 రన్స్ చేశాడు. ఒక సిరీస్ లో ఇప్పటివరకు 47 సిక్స్ లు కొట్టింది భారత్. 2018-19లో నమోదైన ఈ రికార్డును.. ఈ సిరీస్ లో మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే బ్రేక్ చేసింది. ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్స్(28)లతో విశాఖలో రికార్డు నెలకొల్పింది టీమ్ఇండియా.