ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో అద్భుతం(Excellent)గా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్.. జస్ ప్రీత్ బుమ్రా. ఈ సిరీస్ లో అందరికన్నా ఎక్కువగా వికెట్లు తీసింది కూడా అతడే. గత మూడు టెస్టుల్లో 80.5 ఓవర్లు వేసి 17 వికెట్లు తీసుకున్నాడు. అయితే కంటిన్యూగా గ్రౌండ్ లో ఉండటంతో బుమ్రాపై మానసిక ఒత్తిడి పడుతోందట. ఈ విషయాన్ని గమనించిన టీమ్ మేనేజ్మెంట్.. అతడికి విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచనతో ఉంది. అయితే ఆ నిర్ణయాన్ని మాత్రం బుమ్రాకే వదిలేయాలని డిసైడ్ అయింది. తొలి టెస్టులో ఆడిన కేఎల్ రాహుల్.. గాయంతో రెండు, మూడో టెస్టులకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జస్ప్రీత్ సైతం నాలుగో టెస్టు ఆడతాడా, లేదా అన్నది అతడి డిసిషన్ పైనే ఆధారపడి ఉంది.
ఒకటి తర్వాత ఒకటి…
అతి త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) స్టార్ట్ కాబోతున్నది. అన్నీ కుదిరితే మార్చి 22 నుంచి ఈ మెగా ఈవెంట్ మొదలవుతుంది. సార్వత్రిక ఎన్నికల(General Elections) దృష్ట్యా IPLను రెండు దశల్లో నిర్వహించాల్సి వస్తే మాత్రం.. మే మధ్యలో టోర్నీ ముగుస్తుంది. ఆ వెంటనే జూన్ లో టీ20 వరల్డ్ కప్ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా టోర్నమెంట్స్ ఉండటంతో అన్నింట్లోనూ బుమ్రా ప్రాతినిధ్యం(Participation) అవసరం. కాబట్టి ఇంగ్లండ్ తో సిరీస్ లోనైనా కాస్త విశ్రాంతినిస్తేనే మేలన్న భావన అటు మేనేజ్మెంట్ లో ఇటు BCCI వర్గాల్లో కనిపిస్తున్నది. వాస్తవానికి బుమ్రాను మూడో టెస్టులోనే పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినా.. సిరీస్ 1-1తో సమంగా ఉన్న టైమ్ లో కీలక ఆటగాడిని దూరం చేసుకోవద్దన్న ఆలోచనతో అతణ్ని ఆడించారు.
బుమ్రా ప్లేస్ లో అతడేనా…
ఒకవేళ బుమ్రా ఆడకపోతే అతడి స్థానంలో ముకేశ్ కుమార్ కు ఛాన్స్ దక్కొచ్చు. రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ముకేశ్.. కెరీర్ లోనే అత్యత్తమంగా 50 రన్స్ ఇచ్చి 10 వికెట్లు తీసుకుని టీమ్ ను గెలిపించాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో 91 రన్స్ ఇచ్చి 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా… నాలుగో టెస్టుకు దూరమైతే మాత్రం ముకేశ్ కు ఛాన్స్ దొరకవచ్చు. ఇంగ్లండ్ తో రెండో టెస్టులో సిరాజ్ గైర్హాజరీలో ఆడిన ముకేశ్.. 70 రన్స్ ఇచ్చి కేవలం ఒకటే వికెటే తీశాడు. ఒకవేళ బుమ్రా ఆడకుంటే మాత్రం ముకేశ్, అన్ క్యాప్డ్ ప్లేయరైన ఆకాశ్ దీప్ మధ్య పోటీ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో భాగంగా ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో టాపర్ గా నిలిచిన ఆకాశ్… ఇంగ్లండ్ తో చివరి 3 టెస్టులకు జట్టులోకి వచ్చాడు.