అయోధ్యానగరి(Ayodhya)లో బాలరాముడు కొలువై సరిగ్గా ఇవాళ్టికి నెల రోజులైంది. జనవరి 22న ఆలయ ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరిగితే.. ఆ బాలరాముణ్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు(Pilgrims) తరలివస్తున్నారు. ఈ నెల రోజుల్లోనే 60 లక్షల మంది దర్శనాలు చేసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రోజుకు 2 లక్షల మంది చొప్పున రామ్ లల్లాను దర్శించుకున్నారని, ఆలయం ప్రారంభించిన తొలి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా సందర్శించారని తెలిపింది.
రామ మందిర నిర్మాణంతో అయోధ్యకు పునర్వైభవం రానున్నట్లు SBI నివేదిక(Report)తోపాటు విదేశీ స్టాక్ మార్కెట్ సంస్థ అయిన జెఫరీస్ సైతం.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేశాయి. రానున్న రోజుల్లో ఏటా 5 కోట్ల మంది భక్తులు వస్తారని, తద్వారా యూపీకే కాకుండా భారతదేశ టూరిజానికి అయోధ్య కీలకంగా వెలుగొందుతుందని SBI చెప్పింది. ప్రపంచ ప్రఖ్యాత(World Famous) ప్రార్థనా స్థలాలైన సౌదీ అరేబియాలోని మక్కాను ఏటా 2 కోట్ల మంది విజిట్ చేస్తుండగా.. ఆ దేశానికి 12 బిలియన్ డాలర్ల(రూ.10 లక్షల కోట్లు) ఆదాయం వస్తున్నది. వాటికన్ సిటీని ప్రతి సంవత్సరం 90 లక్షల మంది సందర్శిస్తుంటే 315 మిలియన్ డాలర్ల(రూ.26,775 కోట్ల) రెవెన్యూ వస్తోంది.
ప్రస్తుతం అయోధ్యకు రోజుకు రెండు లక్షల చొప్పున లెక్కేసుకుంటే రానున్న రోజుల్లో అది 3 లక్షలకు చేరుతుందట. ఒక్కో భక్తుడు రూ.2,500 ఖర్చు చేసినా అయోధ్యకు వచ్చే ఆదాయం రూ.25 వేల కోట్లుగా ఉంటుంది. ఇక అయోధ్యను దర్శించుకునే మార్గంలో వారణాశిలోని కాశీ విశ్వనాథ్, మథురలోని బాంకే బిహారీ ఆలయాల్ని చుట్టి వచ్చే అకాశాలుంటాయి. ఈ మూడు ఆలయాల ద్వారానే UPకి లక్ష కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందట. ఈ రెవెన్యూతో భారతదేశ టూరిజం రూపురేఖలే మారిపోతాయని SBI అంచనా వేసింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. అయోధ్య రామ మందిరం వల్ల ఏటా 4 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత సంపన్న రాష్ట్రంగా అవతరించబోతున్నది.
దేశంలో అత్యధికంగా యాత్రికులు వచ్చే ఆలయం తిరుమల. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి బాలాజీని దర్శించుకునేందుకు ఏటా 2.5 కోట్ల మంది భక్తులు విచ్చేస్తుంటే రూ.1,200 కోట్ల ఆదాయం లభిస్తోంది. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి ప్రతి సంవత్సరం 80 లక్షల మంది భక్తుల సందర్శనకు గాను రూ.500 కోట్ల రెవెన్యూ వస్తున్నది. వీటన్నింటికీ మించి రానున్న సంవత్సరాల్లో అయోధ్యకు తద్వారా యూపీ రాష్ట్రానికి భారీయెత్తున రాబడి రానుందని తన రిపోర్ట్ లో SBI తెలిపింది.