అంతర్జాతీయ(International) విద్యాలయాలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్ని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన భవనాల నిర్మాణాలు(Constructions) మొదలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖపై సమీక్ష(Review) నిర్వహించిన డిప్యుటీ CM భట్టి విక్రమార్క… నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా సొంత సెగ్మెంట్…
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్(Residential) స్కూల్స్(Schools) ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్టును మధిర నియోజకవర్గంలో అమలు చేయనున్నారు. బాలుర పాఠశాలను చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలో… బాలికల విద్యాలయాన్ని ఎర్రుపాలెం మండల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.2500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా BC, SC, ST, మైనారిటీ రెసిడెన్షియల్ కు సంబంధించి 100 పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్లు భట్టి తెలిపారు. ఒక్కో రెసిడెన్షియల్ బిల్డింగ్ కు రూ.25 కోట్ల చొప్పున మొన్నటి బడ్జెట్ లో కేటాయించామని, వెంటనే వాటి పనులు మొదలుపెట్టాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.
అందరూ ఒకేచోట…
అన్ని సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులంతా ఒకేచోట ఉండటం వల్ల కుల రహిత సమాజానికి బాటలు వేసే అవకాశమున్నందునే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం(Co-Ordination) చేసుకునేలా చూడాలని ప్రణాళిఖ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అబ్దుల్ నదీంను ఆదేశించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ కు సంబంధించి బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను డిప్యుటీ CM తిలకించారు.