రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలనే అప్రతిష్ఠపాలు(Bad Name) చేసేందుకు విద్యుత్తు శాఖలోని కొందరు ఉద్యోగులు… కావాలనే కరెంటు కట్ చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సర్కారుకు చెడ్డపేరు తెచ్చే కుట్రలు చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డ CM.. కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామన్నారు.
కోతల్లేకుండా…
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎక్కడా కరెంటు కోతలు(Power Cuts) విధించడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ అమలు చేయబోతున్న పథకాలు, ప్రస్తుతం సాఫీగా సాగిపోతున్న కరెంటు సరఫరాపై దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. మరమ్మతుల(Repairs) పేరిట ఇష్టమొచ్చినట్లు కరెంటు తీయడాన్ని తప్పుబడుతూ.. అలా చేయాల్సి వస్తే ప్రజలకు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకు సమాచారం వెళ్లిన తర్వాతే కరెంటు సప్లయ్ ని ఆపాలని ఉన్నతాధికారులకు CM ఆదేశాలిచ్చారు.