రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 27 నుంచి అమలు చేయబోతున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్(Cylinder) పథకం(Scheme) లబ్ధిదారులకు ఎలా అందుతుంది… ఈ సిలిండర్ తీసుకోవాలంటే ముందుగా ఏం చేయాలి… ఇస్తున్నది సబ్సిడీయే అయినా ముందుగా ఎంత చెల్లించాలి… ఈ ప్రశ్నలన్నింటికీ పౌరసరఫరాల(Civil Supplies) శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన సబ్సిడీ సిలిండర్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన ప్రభుత్వం… ఆ దిశగా అధికారులకు కీలక సూచనలు చేసింది. దీంతో సివిల్ సప్లయ్ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో చర్చించారు.
పూర్తిగా చెల్లించాల్సిందే…
ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955 ఉండగా… డెలివరీ ఛార్జీ పేరిట మొత్తం రూ.1,000 దాకా తీసుకుంటున్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇచ్చే రూ.500కే గ్యాస్ సిలిండర్ కు ఎంత చెల్లించాలన్నది ఇప్పటిదాకా లబ్ధిదారులకు తెలియడం లేదు. అయితే ఈ సిలిండర్ కోసం ముందుగా మొత్తం నగదు అయిన రూ.955 చెల్లించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ రూ.955లో సబ్సిడీ అయిన రూ.500 నగదు ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా(Accounts)ల్లో జమ కానుంది.
లబ్ధిదారుల సంఖ్య ఇలా…
ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది మహిళా లబ్ధిదారుల(Beneficiaries)ను గుర్తించింది ప్రభుత్వం. తొలి దశలో వీళ్లకు మాత్రమే సబ్సిడీ అందుతుంది. లబ్ధిదారులకు అందించే సబ్సిడీకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్లాట్ ఫామ్ గా పనిచేయనుండగా.. నోడల్ బ్యాంకుగా SBI ఉంటుంది. ప్రభుత్వం ముందుగానే ఇచ్చే సబ్సిడీ నగదు(Amount) బ్యాంకులోనే ఉంటుంది. సిలిండర్లు డెలివరీ అయ్యాక బ్యాంకులో ఉన్న సొమ్ము నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ సబ్సిడీని NPCI ట్రాన్స్ ఫర్ చేస్తుంటుంది.
కొత్తగా తీసుకుంటే…
కొత్త(Newly)గా తీసుకునే గ్యాస్ సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తించబోవట్లేదని క్లారిటీ వచ్చింది. ఇప్పటిదాకా ఉన్న కనెక్షన్లలో ఆహార భద్రత కార్డులు ఉన్నప్పటికీ అవి రెగ్యులర్ గా వాడకం(Useful)లో ఉంటేనే సబ్సిడీ రానుంది. వాడకంలో లేని సిలిండర్లను ఇప్పుడు కంటిన్యూ చేసినా సబ్సిడీ వర్తించదు. కస్టమర్లు గత మూడేళ్లుగా సిలిండర్లు వాడుతున్న తీరును అంచనా వేశాక సంవత్సరానికి యావరేజ్ గా ఎన్ని వాడుతున్నారనేది గుర్తించి ఇక నుంచి ఎన్ని రాయితీ సిలిండర్లు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు.