టార్గెట్ 192 పరుగులు.. తొలి వికెట్ కోల్పోయింది 84 పరుగుల వద్ద.. ఇక విజయం(Winning) నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ అనిశ్చితి(Uncertainity)కి మారుపేరైన క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా.. సరిగ్గా భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టులోనూ అదే జరిగింది. ప్రత్యర్థిని రెండో ఇన్నింగ్స్ లో 145కే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ లీడ్ తో కలిపి 192 స్కోరు ఛేదించాల్సిన పరిస్థితుల్లో… టీమ్ఇండియా టపటపా వికెట్లు చేజార్చుకుంది. 84/1తో కనిపించిన స్కోరు బోర్డు కాస్తా.. 120కి చేరుకునేసరికి 5 వికెట్లతో దర్శనమిచ్చింది కానీ చివర్లో ఎలాంటి తడబాటు లేకుండా గిల్-జురెల్ జోడీ లక్ష్యాన్ని కరిగించేసింది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టును 5 వికెట్లతో తేడాతో గెలుచుకుంది.
రోహిత్ హాఫ్ సెంచరీ అయినా…
ముఖ్యంగా రోహిత్ శర్మ(55; 81 బంతుల్లో 5×4, 1×6) మూడో రోజు సాయంత్రంతోపాటు నాలుగో రోజు ఉదయం కొద్దిసేపు ధాటి(Speed)గా ఆడాడు. అటు అతడి జోడీ జైస్వాల్ సైతం(37; 44 బంతుల్లో 5×4) ఫర్వాలేదనిపించాడు. కానీ అంతలోనే పరిస్థితి మారిపోయిన ఇక వికెట్లు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. రజత్ పటీదార్(0) మరోసారి చేతులెత్తేస్తే.. జడేజా(4), సర్ఫరాజ్(0) వికెట్లు అప్పగించారు. ఈ ముగ్గురు కీలక బ్యాటర్లను తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసుకున్న షోయబ్ బషీరే ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత మొదలైంది.. ఇద్దరు యువ బ్యాటర్ల సహనానికి పరీక్ష. అలాంటిలాంటి పరీక్ష కాకుండా అగ్నిపరీక్షనే ఎదుర్కొని విజయం సాధించారు శుభ్ మన్ గిల్-ధ్రువ్ జురెల్.
గిల్-జురెల్ జిల్ జిల్…
ఒకవైపు గిల్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూనే ఉన్నా.. అప్పటికే 5 వికెట్లు పడ్డ వేళ ఏ మూలనో సందేహం. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో ధ్రువ్ జురెల్.. గిల్ తో కలిసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కొలీగ్స్ అంతా ఒక్కరొక్కరే వెనుదిరగడం, పిచ్ లో మార్పు కనిపించడంతో బ్యాటింగ్ ను గిల్(52 నాటౌట్; 124 బంతుల్లో 2×6) నిదానంగా కొనసాగించాడు. అతడు 122 బంతులాడి ఒక్క ఫోర్ లేకుండానే 2 సిక్స్ లతో 50 మార్క్ ను చేరుకున్నాడంటే ఎంత ఓపికతో బ్యాటింగ్ చేశాడో అర్థమవుతుంది. 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండు సిక్స్ లు బాది హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. మరోవైపు జురెల్(39; 77 బంతుల్లో 2×4) మాత్రం గిల్ కన్నా కొంచెం దూకుడు చూపించాడు.
సిరీస్ మనదే…
ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలి ఉండగానే భారత్ 3-1తో గెలుచుకుంది. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో 28 రన్స్ తేడాతో ఓడిపోయిన టీమ్ఇండియా.. విశాఖ, రాజ్ కోట్, రాంచీల్లో జరిగిన తర్వాతి మూడు టెస్టుల్లో వరుసగా విజయాలు సాధించింది.