మానసిక(Mental) పరిణతి(Meturity)తోనే పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది.. ఇందుకు సరైన వయసు ఉంటేనే ఆ ఎదుగుదలకు అర్థం, పరమార్థం. ప్రీ-స్కూల్ అంటూ రెండేళ్లకే బడులకు పంపుతున్న తల్లిదండ్రుల్ని చూస్తున్నాం. అమ్మ, నాన్న, కుటుంబం ఆలనా పాలనా లేక ఒక రకమైన ధోరణులకు అలవాటు పడుతున్నారు పసివాళ్లు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ ఊదరగొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నిజంగానే ప్రపంచంలోని కొన్ని దేశాల్ని చూస్తే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. సరైన వయసు వచ్చిన తర్వాతే పిల్లల్ని బడికి పంపే పద్ధతులు పాశ్చాత్య(Western) దేశాల్లో(Countries) అమలవుతున్నాయి. ఇప్పుడదే విధానాన్ని మన దేశమూ ఆచరించబోతున్నది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలివే..
2021 మార్చి 31న తీసుకున్న నిర్ణయం మేరకు జాతీయ(National) విద్యా విధానం(Educational Policy) 2020 ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన వయసును నిర్ధారించింది. ఆరేళ్లు దాటితే(6+)నే ఫస్ట్ క్లాస్ లో చేర్చుకునేలా చూడాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం(RTE) 2009 ప్రకారం గ్రేడ్-1(Grade-1)లో చేర్చాలంటే కనీస వయసు ఆరు సంవత్సరాలు దాటాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ అర్చనా శర్మ అవస్థి పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.
2024-25 నుంచి…
చిన్న పిల్లల విద్యావ్యవస్థ తీరుపై గత కొన్నేళ్లుగా పూర్తిస్థాయిలో అధ్యయనం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆరేళ్లు పూర్తయిన పిల్లల్ని మాత్రమే ఒకటో తరగతిలో చేర్చే ప్రక్రియను 2024-25 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలంటూ తాజా ఆదేశాల్లో కేంద్రం తెలియజేసింది. దీంతో కొత్త విద్యా సంవత్సరంలో ఆరేళ్లు దాటిన పిల్లల్ని మాత్రమే స్కూళ్లల్లో వేయాల్సి ఉంటుంది.