ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలు.. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తునే గందరగోళంలో పడేశాయి. ఆ స్థానాన్ని అధికార పార్టీ సునాయాసం(Easy)గా గెలుచుకునే అవకాశం ఉన్నా.. క్రాస్ ఓటింగ్(Cross Voting) తో పరిస్థితి తారుమారైంది. దీంతో తమకే పూర్తి మద్దతు ఉందంటూ ప్రతిపక్ష పార్టీ ఏకంగా అవిశ్వాస తీర్మానమే ప్రవేశపెడుతుండటంతో హిమాచల్ ప్రదేశ్ సర్కారు అయోమయంలో పడిపోయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ కు 40, BJPకి 25 మందితోపాటు ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. ఇక్కణ్నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి, BJP తరఫున హర్ష్ మహాజన్ బరిలో నిలిచారు.
కానీ పరిస్థితి…
ఈ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 9 మంది BJP అభ్యర్థికి ఓటు వేశారు. కాంగ్రెస్ కున్న 40లో 6 తగ్గడం వల్ల 34 కాగా.. 25 మంది సభ్యులున్న కమలం పార్టీకి 9 మంది మద్దతుతో 34 కావడంతో ఇరుపార్టీల బలాబలాలు సమానమయ్యాయి. ఫలితం టై కావడంతో రూల్స్ ప్రకారం లాటరీ తీశారు. ఈ లాటరీ ద్వారా అదృష్టం BJP అభ్యర్థి హర్ష్ మహాజన్ ను వరించింది. దీంతో రాష్ట్రంలో గందరగోళం ఏర్పడగా.. తమ MLAలను ప్రతిపక్షం కిడ్నాప్ చేసిందని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ఆరోపించారు.
మంత్రి రాజీనామా…
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల జంపింగ్ తో అవస్థలు పడుతున్న కాంగ్రెస్ కు.. ఏకంగా మంత్రే రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రిగా కొనసాగలేనంటూ విక్రమాదిత్య సింగ్ రిజైన్ లెటర్ పంపించారు. గెలిచిన ఏడాది కాలం నుంచి MLAలను పట్టించుకోకపోవడమే క్రాస్ ఓటింగ్ కు కారణమని విక్రమాదిత్య అన్నారు. అటు రాజ్యసభ సీటును దక్కించుకున్న BJP నేతలు.. అక్కడి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. కాంగ్రెస్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కమలం పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న దృష్ట్యా.. ఆ పార్టీ నేతలు గవర్నర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.