పార్లమెంటు, శాసనసభ సభ్యుల లంచాల కేసుల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం(Top Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో చట్టసభల సభ్యులకు ఎలాంటి మినహాయింపు(Excemption) ఉండదని తేల్చిచెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచాలు తీసుకుంటే రక్షించేది లేదంటూ ఖరాకండీగా స్పష్టం చేసింది. దీనిపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం(Constitutional Bench) ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. 1998లో ఐదుగురు సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
1998 తీర్పు విరుద్ధం…
లంచం తీసుకున్న కేసులో MPలపై 1998లో ఇచ్చిన తీర్పు నేరస్థుల్ని కాపాడేలా ఉందని, ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల బెంచ్ అభిప్రాయపడింది. చట్టసభల్లో చేసే ప్రసంగాలు(Speech), ఓటు(Vote) విషయాల్లో MPలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పి.వి.నర్సింహారావు వర్సెస్ CBI కేసులో 1998లో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సి ఉందంటూ గతంలోనే సుప్రీం తెలిపింది.
కొట్టివేస్తూ సంచలన తీర్పు…
లంచం తీసుకుంటే న్యాయ విచారణ నుంచి తప్పించుకోజాలరంటూ 1998 కేసును కొట్టివేస్తూ తాజాగా చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విస్పష్ట తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, ఆర్టికల్ 194 ప్రకారం నాటి తీర్పు పూర్తి విరుద్ధమని సుప్రీం బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాలు బెంచ్ లో మిగతా న్యాయమూర్తులు.