గత ప్రభుత్వంలో ఈ మంత్రి ఇంగ్లిష్ లో ఎంత బాగా మాట్లాడారో చూడండి.. ఈ గవర్నమెంట్ లో ఈయన ఆంగ్ల భాష చూస్తే ఎలా ఉందో పరిశీలించండి.. ఇదే మన నేతల తీరు అంటూ ఆయా లీడర్ల వీడియోలు పెడుతూ సోషల్ మీడియా(Social Media)లో హల్చల్ చేస్తున్న రోజులివి. ఈ పైత్యం మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడితే ఇప్పుడు తెలంగాణకూ పాకింది. ఇంగ్లిష్ భాషా సంస్కృతి గురించి ఈ మధ్యకాలంలో తెలంగాణలో నేతలు తరచూ విమర్శలు(Criticises) చేసుకుంటున్నారు. అలాంటి భాషపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
ఇంగ్లిష్ రాకుంటే…
చిన్నప్పట్నుంచి తాను ప్రభుత్వ బడుల్లోనే(Govt Schools)లోనే చదువుకున్నానని, ఆనాడు తమ టీచర్లు అందించిన జ్ఞానంతోనే ఈ రోజు పాలన చేస్తున్నానని CM రేవంత్ గుర్తు చేశారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తూ కొన్ని సూచనలు చేశారు. ఇంగ్లిష్ రాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచవద్దని కోరారు. ఆంగ్లం(English) రాని చైనా, జపాన్, జర్మనీ దేశాలు ప్రపంచాన్నే ఏలుతున్నాయని, పరాయి భాష రానంత మాత్రాన మనుషుల్ని పరాయివారిగా చూడవద్దని అభ్యర్థించారు.
కేటీఆర్, రేవంత్ మధ్య పోలిక…
అభిమానులు, సామాన్య వ్యక్తులే కాదు.. ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు సైతం తమ నేతను పొగుడుతూ ప్రత్యర్థి లీడర్లను విమర్శిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి KTR, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య పోలికల్ని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ ఇచ్చిన సూచనలు… ఇంగ్లిష్ భాషపై మరోసారి చర్చకు తెరతీసినట్లయింది.