అసలే వరుసగా మూడు టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్(England)కు… భారత్(Team India)లో ఆడటం ఎంత కష్టమో అర్థమైంది. బజ్ బాల్ ఆటతీరుతో బెంబేలెత్తిస్తామంటూ బీరాలు పలికిన ఇంగ్లిష్ జట్టుకు.. గ్రౌండ్ లో దిగితే గానీ అసలు విషయం అర్థం కాలేదు. ఐదో టెస్టులో ఇంగ్లండ్ పై భారత్ పూర్తి ఆధిపత్యం సాధించడమే కాకుండా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ధర్మశాలలో జరుగుతున్న టెస్టులో రెండో రోజున ప్రారంభం నుంచే రోహిత్, గిల్ పూర్తి కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేస్తుండటంతో.. వేగంగా రన్స్ వచ్చాయి. 135/1తో బ్యాటింగ్ కంటిన్యూ చేసిన టీమ్ఇండియాకు… ఈ ఇద్దరి దంచుడుతో ప్రత్యర్థికి చుక్కలు కనపడ్డాయి.
ఒకర్ని మించి మరొకరు…
రోహిత్ శర్మ నిన్న 77 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తే ఈ రోజు శుభ్ మన్ 64 బాల్స్ లోనే ఫిఫ్టీ క్రాస్ అయ్యాడు. ఈ జోడీ రెండో వికెట్ కు 149 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్నర్ షిప్ జత చేసింది. ముఖ్యంగా అర్ధ సెంచరీ తర్వాత గిల్ రెచ్చిపోయాడు. సిక్సర్లతో ఇంగ్లండ్ భరతం పడుతూ భారత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇంగ్లిష్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జంటపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు.
సెంచరీలు ఇలా…
సెంచరీ మార్క్(100)ను చేరుకోవడానికి రోహిత్ కు 154 బంతులు అవసరమయ్యాయి. అందులో 13 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక గిల్ సైతం ఆ వెంటనే 100 కంప్లీట్ చేశాడు. ఇతడు కేవలం 137 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్స్ లతో వంద పూర్తి చేశాడు. లంచ్ విరామానికి 264/1తో నిలిచిన టీమ్ఇండియా ప్రస్తుతానికి 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.