భారత్ బ్యాటింగ్ తీరు చూస్తే వచ్చినోళ్లంతా దంచికొట్టుడే అన్నట్లుగా సాగింది. ప్రతి ప్లేయరూ బ్యాట్ కు పనిచెప్పడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండోరోజంతా చెమటోడ్చినా మన టీమ్ ను ఆలౌట్ చేయలేకపోయారు ఇంగ్లిష్ క్రికెటర్లు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అంతా రాణించడంతో భారత్ కు ఇప్పటికే 255 పరుగుల లీడ్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 218కే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా క్రీజులో ఉన్నారు.
అంతా సూపర్…
రోహిత్ శర్మ(103; 162 బంతుల్లో 13×4, 3×6), శుభ్ మన్ గిల్(110; 150 బంతుల్లో 12×4, 5×6), జైస్వాల్(57; 58 బంతుల్లో 5×4, 3×6), దేవ్ దత్ పడిక్కల్(65; 103 బంతుల్లో 10×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్(56; 60 బంతుల్లో 8×4, 1×6) ఇలా అందరూ బాగా ఆడారు. సెంచరీల తర్వాత రోహిత్, గిల్ ఔటవగానే క్రీజులోకి వచ్చిన పడిక్కల్… అరంగేట్ర(Debut) టెస్టులోనే తానేంటో నిరూపించాడు. తొలి 30 పరుగుల్లో 7 ఫోర్లు ఉన్నాయంటే అతడి స్పీడ్ ఎలా సాగిందో తెలుస్తున్నది. కానీ ఆ తర్వాత నెమ్మదించిన పడిక్కల్.. అవసరానికి తగ్గట్లుగా బ్యాటింగ్ సాగించాడు.
ఆ తర్వాత కూడా…
జడేజా(15), జురెల్(15) కొద్ది సేపే నిలబడ్డా.. చివర్లో కుల్దీప్(27 నాటౌట్), బుమ్రా(19 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత్ ను ఆలౌట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఇంగ్లండ్ వశం కాలేదు. దేవ్ దత్, సర్ఫరాజ్ జంట ఐదో వికెట్ కు 97 పరుగులు జోడించింది. ఆ జట్టు బౌలర్లలో షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్ లీ 2, స్టోక్స్, అండర్సన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
మ్యాచ్ లో రికార్డులవి…
టెస్టుల్లో రోహిత్ 12వ సెంచరీని పూర్తి చేసుకుంటే, గిల్ నాలుగో 100ను దాటాడు. గిల్ ను ఔట్ చేయడం అండర్సన్ కు ఇది ఆరోసారి. ఈ సిరీస్ లో తొలిసారి బౌలింగ్ కు దిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఫస్ట్ బాల్ కే రోహిత్ ను ఔట్ చేశాడు.