సోషల్ మీడియా(Social Media) అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలకు మంచి సరకుగా మారిపోయింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానిది పైసా పెట్టుబడి లేకుండా సోషల్ మీడియాతో జరిగిపోతున్నది. ఒక విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రస్తుత రోజుల్లో అన్ని పార్టీలు(Political Parties) వీటిని వాడుకుంటున్నాయి. పోలింగ్ కు 48 గంటల ముందు మైకుల ప్రచారం మూగబోతున్నా… ఈ సోషల్ మీడియా హోరు మాత్రం చివరి క్షణం వరకూ ఓటర్లను వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయంలో అన్ని పార్టీల కంటే ముందుండే భారతీయ జనతా పార్టీ(BJP)… ఏకంగా సోషల్ మీడియా వారియర్స్ నే తయారు చేసుకుంది.
అమిత్ షా భేటీ…
ఈ నెల 12న తెలంగాణకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సోషల్ మీడియా వారియర్స్(Warriors) తో హైదరాబాద్ లో సమావేశం కాబోతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలా ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి వ్యూహాలు(Plans) అమలు చేయాలి.. ఓటర్లను ఆకర్షించేలా పోస్టుల్ని ఎలా తయారు చేయాలి అన్న విషయాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఈ ప్రోగ్రాంలో సుమారు మూడు వేల మంది వారియర్స్ పాల్గొంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
బూత్ స్థాయిలోనూ…
వారియర్స్ తో భేటీ అనంతరం బూత్ స్థాయి లీడర్లతోనూ అమిత్ షా సమావేశమవుతారు. ఇందుకోసం 25 వేల మంది బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులు రానున్నారు. గ్రామాల వారీగా ప్రతి బూత్ పరిధిలో 370 ఓట్లు ఉండి, వాటిని సమన్వయం(Co-Ordinate) చేసుకునే బాధ్యత ఈ ప్రెసిడెంట్లదే కాగా వారందరికీ హోంమంత్రి సూచనలు చేస్తారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటికే పలువురు అభ్యర్థుల్ని ప్రకటించిన BJP హైకమాండ్… మిగతా క్యాండిడేట్స్ ను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే రాష్ట్రంలో ఓటర్లను అలర్ట్ చేసేలా సోషల్ మీడియాతోపాటు బూత్ స్థాయిలో కార్యక్రమాల్ని స్పీడప్ చేసింది.