ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాల(Continue Wins)కు బ్రేక్ పడింది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆనందంతో ఉన్నా.. గెలుపునకు దగ్గరగా వచ్చి విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. చివర్లో ఒత్తిడికి గురై ఐదు వికెట్లను టపటపా చేజార్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న UP.. 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీని 137కే ఆలౌట్ చేసి ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
రాణించిన బ్యాటర్లు…
UP టీమ్ లో దీప్తి శర్మ(59) ఒక్కరే రాణిస్తే.. అటు ఢిల్లీ జట్టులోనూ కెప్టెన్ మెగ్ లానింగ్ ఒంటరి పోరాటం చేసింది. 124కు ఐదు వికెట్లతో విజయం దిశగా సాగుతుందనుకున్న ఢిల్లీ ఆఖర్లో తడబడింది. కేవలం 4 పరుగుల వ్యవధిలోనే 128కి 7 వికెట్లు చేజార్చుకుంది. దీంతో మ్యాచ్ కాస్తా ఉత్కంఠకు దారితీసింది.
టెన్షన్ టెన్షన్…
ఆరు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన ఢిల్లీకి… చివరి ఓవర్ ఫస్ట్ బాల్ నే రాధా యాదవ్ సిక్స్ బాదింది. రెండో బంతికి రెండు రన్స్ వచ్చాయి. ఇక నాలుగు బాల్స్ లో రెండు రన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో వరుసగా మూడు బాల్స్ కు మూడు వికెట్లు పడ్డాయి. దీంతో ఒక బాల్ మిగిలి ఉండగానే 19.5 ఓవర్లలో ఢిల్లీ ఓటమిని మూటగట్టుకుంది. చివరి ఓవర్లో గ్రేస్ హారిస్ మాయ చేసి ఢిల్లీని ఓటమి పాలు చేసింది.