ఇంగ్లండ్(England) జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. భారత పర్యటన(India Tour)లో వరుసగా నాలుగు టెస్టులు కోల్పోయి ఐదు టెస్టుల సిరీస్ ను 4-1తో ప్రత్యర్థికి అప్పగించింది. ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి పాలైంది. మొదటి ఇన్నింగ్స్ లో 218 పరుగులు చేయగా.. తన తొలి ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా 477 రన్స్ కు ఆలౌటైంది. 259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్టోక్స్ సేన.. ఆ స్కోరు చేరుకోకుండానే కుప్పకూలింది. దీంతో భారత్ కు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశమే ఇవ్వలేదు. 195కే ఆలౌటై ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మూడు రోజుల్లోనే…
తొలి రోజు చివరి సెషన్ తోపాటు రెండో రోజు(Second Wicket) ఆట మొత్తాన్ని శాసించిన భారత్.. ఇంగ్లండ్ కు ఛాలెంజ్ విసిరింది. మూడో రోజు 473/8తో బ్యాటింగ్ కొనసాగించిన కుల్దీప్(30), బుమ్రా(20).. మరో 4 పరుగులు జోడించి అవుటవడంతో 477 వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఇద్దరూ తొమ్మిదో వికెట్ కు 49 పరుగుల పార్ట్నర్ షిప్ ఇచ్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ ఈ సిరీస్ లో మరోసారి 5 వికెట్లు తీసుకోగా… అండర్సన్, హార్ట్ లీ రెండు వికెట్ల చొప్పున, స్టోక్స్ 1 వికెట్ తీసుకున్నారు.
మళ్లీ చుక్కలు…
259 రన్స్ భారీ లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ఒక పట్టాన వదిలిపెట్టలేదు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో కుల్దీప్ మాయ చేస్తే రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ సైతం ఆ మార్క్ ను దాటాడు. ఓపెనర్లు జాక్ క్రాలీ(0), బెన్ డకెట్(2), ఒలీ పోప్(19), జానీ బెయిర్ స్టో(39), బెన్ స్టోక్స్(2), బెన్ ఫోక్స్(8) ఔటయ్యారు. ఈ ఆరుగురిలో ఐదుగుర్ని అశ్వినే వెనక్కు పంపాడు. 36 స్కోరుకే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 113కు చేరుకునేసరికి 6 వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత ఒకే ఓవర్లో హార్ట్ లీ(20), మార్క్ వుడ్(0)ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేశాడు.
సిరీస్ కైవసం…
తొలి టెస్టు చేజార్చుకున్నా కంటిన్యూగా నాలుగు టెస్టుల్లో గెలుపొంది 4-1 తేడాతో సిరీస్ ను భారత్ అందుకుంది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లో మొత్తం 9 వికెట్లను అశ్విన్ తీసుకున్నాడు. మొత్తం 7 వికెట్లు, 30 రన్స్ చేసిన కుల్దీప్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. సిరీస్ లో 712 పరుగులు చేసిన జైస్వాల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నారు. 5 వికెట్ల ఘనతను 36 సార్లు అందుకున్న తొలి భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.