ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జూన్ 1 నుంచి ఈ ఫిట్ మెంట్ అమలులోకి వస్తుందని మంత్రి తెలిపారు. కొత్త ఫిట్ మెంట్ తో సంస్థపై నెలకు రూ.35 కోట్ల భారం పడనుంది. మొత్తం 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి(Benefit) కలగనుంది. 42,057 మంది ప్రస్తుత ఉద్యోగులతోపాటు 11,014 మంది పదవీ విరమణ(Retirement) చేసిన ఎంప్లాయీస్ కు ఇది వర్తించనుంది.
ఎదురుచూపులకు తెరపడినా…
నాలుగు సంవత్సరాలకోసారి PRC ప్రకటించాల్సి ఉండగా 2017 నుంచి అది పెండింగ్ లో పడిపోయింది. దీనికోసం ఉద్యోగులు ఎంతోకాలంగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో జనవరి 31 నాడు గుడ్ న్యూస్ వింటారని జనవరి 30న మంత్రి చెప్పడంతో అది ఏమై ఉంటుందనే కుతూహలం అందరిలోనూ కనిపించింది. ఇప్పుడు ప్రకటించిన పే స్కేల్ ఫిట్ మెంట్ 2017 ఏప్రిల్ 1 నుంచి అమలవుతుందని, 2024 జూన్ 1 నుంచి ఇందుకు సంబంధించిన వేతనాలు చెల్లిస్తామని మంత్రి తెలిపారు. 2017కు సంబంధించిన ఎరియర్స్ మాత్రం ఉద్యోగుల రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామన్నారు.
‘కోడ్’ లోపలే నిర్ణయం…
త్వరలోనే లోక్ సభ ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ఆ లోపలే తమ సమస్యలు పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతున్నది. 2017 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగకపోవడం వల్ల బేసిక్, DA, ఫిట్ మెంట్ ను కోల్పోయినట్లు ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారు. ఇక PF(Provident Fund) బకాయిలు రూ.1,400 కోట్లు, CCS నిధులు రూ.1,200 కోట్లు, SRBC, SBTకి సంబంధించి రూ.700 కోట్లు తక్షణమే చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పటివరకు ఉన్న డిమాండ్లు ఇవే…
* బాండ్ రూపంలో ఉన్న 2013 వేతన సవరణ బకాయిల చెల్లింపు.
* 2013 పే రివిజన్ అగ్రిమెంట్ ప్రకారం 2015 నుంచి ఎరియర్స్ నిధులు రూ.280 కోట్లు చెల్లించాలి.
* 13 ఏళ్లుగా రిఫండ్ చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన.
* 2015 నుంచి 5 ఏళ్ల కాలానికి 9 శాతం వడ్డీతో ఇస్తామని చెప్పిన గడువు 2020కి ముగిసినా నిధులు రాలేదు.
* 2019 జులై 1 నుంచి పెండింగ్ లో పడిపోయిన DA బకాయిలు చెల్లించడం.
* 10 సంవత్సరాల లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వేతనాన్ని ఇవ్వడం.
* పదవీ విరమణ చేసిన కార్మికులకు లీవ్ శాలరీ అందివ్వడం.
* మృతిచెందిన 1100 మంది కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవడం.
* 2017 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగలేదు…
* 2021 ఏప్రిల్ నుంచి మళ్లీ వేతన సవరణ చేపట్టాల్సి ఉంది.
* రెండు పే స్కేల్స్ బాకీ ఉండటం వల్ల రూ.5,000 కోట్ల మేర చెల్లింపులు జరగలేదు.
*ఈ రెండింటి వేతన సవరణకు సంబంధించి ఆర్థిక చెల్లింపులు ఇవ్వాలి.
* పీఎఫ్, సీసీఎస్, SRBC, SBTకి సంబంధించి కార్మికులు జమ చేసుకున్న మొత్తం రూ.3,300 కోట్లు రావాల్సి ఉంది.