త్వరలోనే లోక్ సభ ఎన్నికల ప్రకటన రానున్న దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం(CEC)లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కమిషనర్ అరుణ్ గోయల్ సంచలన నిర్ణయం తీసుకుని ఏకంగా తన పదవికే(Resign) రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే ఆమోదించారు. అయితే ఆయన ఈ నిర్ణయానికి గల కారణాలు బయటకు రాలేదు. సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ(Retirement) చేశారు. ఇప్పుడు గోయల్ కూడా రాజీనామా చేయడంతో ఇక CECలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.
మరో మూడు రోజుల్లో…
సార్వత్రిక ఎన్నికల(General Elections)కు మరో మూడు రోజుల్లో ప్రకటన వస్తుందన్న ప్రచారం దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా తుది దశ(Final Stage)కు చేరుకున్నాయి. ఇలాంటి టైమ్ లో కేంద్ర ఎన్నికల సంఘం కాస్తా ఏకసభ్య కమిషన్ గా మారడం సంచలనం సృష్టించింది. అరుణ్ గోయల్ 2022 నవంబరు 1న ఎలక్షన్ కమిషనర్ గా నియమితులయ్యారు. 1985 IAS బ్యాచ్ కు చెందిన ఈయన.. ఇంతకుముందు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సెక్రటరీగా పనిచేశారు.
మూడున్నరేళ్లకు పైగా…
అరుణ్ గోయల్ పదవీకాలం 2027 డిసెంబరు వరకు ఉంది. మరో మూడున్నరేళ్లకు పైగా పదవీకాలం ఉన్నా అరుణ్ గోయల్ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం, దాన్ని రాష్ట్రపతి అప్పటికప్పుడే ఆమోదముద్ర వేయడం, న్యాయశాఖ సైతం గెజిట్ ప్రచురించడం ఆశ్చర్యకరంగా మార్చింది. కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వ్యక్తినే CECలో నియమించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధాని, లోక్ సభ విపక్ష నేత, కేంద్ర మంత్రి నేతృత్వంలోని కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం ఈ మధ్యనే చట్టం కూడా చేసింది.