రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ఏడాది కాలంగా చికిత్స(Treatment) తీసుకుంటున్న యువ వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ మైదానం(Ground)లో అడుగుపెడుతున్నాడు. పంత్ పూర్తి ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించిన BCCI.. వచ్చే IPL-2024లో ఆడతాడని తెలిపింది. అయితే మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమి, ప్రసిద్ధ్ కృష్ణ మెగా టోర్నీలో ఆడబోరని స్పష్టం చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ KL రాహుల్ పునరాగమనం(Re-Entry)పై ఇంకా క్లారిటీ రాలేదు.
జైషా మాటలతో…
బ్యాటింగ్ లోనే కాదు వికెట్ల వెనకాల కూడా పంత్ ఉత్సాహంగా ఉన్నాడని BCCI కార్యదర్శి జైషా నిన్న ప్రకటించారు. దీంతో పంత్ ఈ IPLలో ఆడతాడని అనుకుంటున్న టైమ్ లో డైరెక్ట్ గా BCCIనే ప్రకటన చేసింది. అన్నీ కుదిరితే ఈనెల 23న జరిగే ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడు. ప్రాక్టీస్ లో భాగంగా కర్ణాటకలోని ఆలూరులో 20 ఓవర్ల మ్యాచ్ ఆడిన పంత్.. ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదని క్రికెట్ బోర్డు తెలిపింది. పంత్ ఈ టోర్నీకి తిరిగివస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ గత నెలలోనే తెలియజేశాడు. అయితే ఇది అతని ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుందని గుర్తుచేశాడు.
గుజరాత్ కు కష్టకాలం…
భారత స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి ఈ మెగా టోర్నీకి దూరమవడం గుజరాత్ టైటాన్స్ కు పెద్ద దెబ్బే. 2023 IPLలో 28 వికెట్లు తీసుకున్న షమి మోకాలికి సర్జరీ కారణంగా IPLకు దూరమవుతున్నట్లు BCCI తెలిపింది. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచిన హార్దిక్ పాండ్య గుజరాత్ ను విడిచి ముంబయి వెళ్లడంతో కెప్టెన్ శుభమన్ గిల్ పైనే ఆశలున్నాయి. ఇంగ్లండ్ తో తొలి టెస్టు ఆడి గాయపడ్డ రాహుల్.. తర్వాతి నాలుగు టెస్టులకు దూరమయ్యాడు. ఇక ఎడమ కాలికి ఫిబ్రవరి 23న సర్జరీ చేయించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడెమీ(NCA) డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్నాడు.