రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అన్ని పథకాల(All Schemes)కు రేషన్ కార్డులే ప్రామాణికం కావడంతో కొత్త కార్డుల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు(Guidelines) వెల్లడించాల్సి ఉంది.
కొత్త ప్రభుత్వంలో…
BRS ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అయినా ఆ పని చేస్తుందన్న ఆశతో చాలా మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. డిసెంబరు 7న కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు.. జనవరిలో రేషన్ కార్డులపై క్లారిటీ ఇస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ మార్చి నడుస్తున్నా ఇంతవరకు క్లారిటీ లేకపోవడంతో జనాల్లో అసహనం కనిపించింది.
త్వరలోనే కార్డులు…
రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు. ఉన్నత కుటుంబాలు సైతం ఆరోగ్యశ్రీ కోసమే కార్డులు తీసుకున్నాయి. కొత్త కార్డుల కోసం 11 లక్షల అప్లికేషన్లు వస్తే.. ఇపుడున్న కార్డుల్లో రేషన్ తీసుకోనివారు 11 శాతం మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కార్డులపై జాప్యమనేది జనాల్లో ఇబ్బందికరంగా తయారయ్యే పరిస్థితికి చేరుకుంది. అందుకే ఈ కేబినెట్ భేటీలో దీనిపై పూర్తి క్లారిటీ ఇస్తూ అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.