ఆడిన మూడు మ్యాచ్ ల్లో ముంబయి చేతిలో ఓటమి పాలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్(Women’s Premier League)లో భాగంగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి 113 రన్స్ కే ఆలౌటయింది. స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు.. మూడు వికెట్లకు 115 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎలిసె పెర్రీ ఆల్ రౌండ్ ప్రదర్శన(Show)తో WPLలో ప్లేఆఫ్స్ తొలిసారి చేరిన ఘనతను బెంగళూరు దక్కించుకుంది.
బ్యాటర్లంతా ఫెయిల్..
ముంబయి ఇండియన్స్ టీమ్ లో అంతో ఇంతో రాణించిందంటే ఓపెనర్లే. హేలీ మాథ్యూస్(26), సజీవన్ సజన(30) కాసేపు నిలబడితే.. నాట్ సీవర్ బ్రంట్(10), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(0), అమేలియా కెర్(2), అమన్ జ్యోత్ కౌర్(4), పూజా వస్త్రాకర్(6) తక్కువ స్కోరుకే బౌలర్లకు చిక్కారు. బెంగళూరు బౌలర్ ఎలిసె పెర్రీ ఈ టోర్నీలోనే అత్యుత్తమంగా బౌలింగ్ చేసి 6 వికెట్లతో హడలెత్తించింది.
మూడు వికెట్లు పడ్డా…
స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినా ప్రారంభంలోనే మూడు వికెట్లు చేజార్చుకుంది మంధాన సేన. ఓపెనర్ స్మృతి(11), సోఫీ మాలినెక్స్(9), సోఫీ డివైన్(4) ఇలా.. 39 స్కోరు వద్దే ముగ్గురూ వెనుదిరిగారు. బౌలింగ్ లో దుమ్ముదులిపిన ఎలిసె పెర్రీ(40 నాటౌట్) బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. వికెట్ కీపర్ రిచా ఘోష్(36) ధనాధన్ బ్యాటింగ్ తో సత్తా చూపింది. ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా బెంగళూరును విజయతీరాలకు చేర్చారు.