LCA(Light Combat Aircraft) తేజస్.. మొబైల్ యాంటీ డ్రోన్ సిస్టమ్.. ALH Mk-IV.. ధనుష్.. LCH ప్రచండ్.. పినాక రాకెట్స్.. ఇవీ భారత్ అమ్ములపొదిలోని అస్త్రాలు. వాజ్ పేయి హయాంలో జరిగిన అణు పరీక్షలతో ప్రపంచానికి తానున్నానంటూ పరిచయం చేసుకున్న రాజస్థాన్ లోని పోఖ్రాన్.. తాజాగా ఈ పరీక్షలతో మరోసారి దద్దరిల్లింది. ‘భారత్ శక్తి’లో భాగంగా త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసాలతో మన సైనిక శక్తి మరోసారి బయటపడింది.
భీకర స్థాయిలో…
రాజస్థాన్ లోని జైసల్మేర్ కు 100 కిలోమీటర్ల దూరంలోని పోఖ్రాన్ లో భారత దళాలు సంయుక్త(Joint) విన్యాసాలు చేశాయి. ప్రత్యర్థులకు దడ పుట్టించేలా దేశంలో తయారు చేసిన అత్యాధునిక ఆయుధాల్ని ఇందులో ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే, ఈ కార్యక్రమాన్ని తిలకించారు. సుమారు గంట పాటు ఈ విన్యాసాలు కొనసాగాయి.
నిఘా వ్యవస్థ…
ఉపగ్రహాలు, గ్రౌండ్ లెవెల్లోని పరిస్థితులను ఆధారం చేసుకుని నిర్వహించిన 8 పరీక్షల్లో భాగంగా తేజస్ యుద్ధ విమానాలు బాంబులు కురిపిస్తే, పినాక రాకెట్లు శత్రు స్థావరాలపై విరుచుకుపడ్డాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నాగ్ మిసైల్ క్యారియర్(NAMICA) విధ్వంసక క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇలా భారీ సైనిక పాటవంతో రాజస్థాన్ లోని పోఖ్రాన్ మరోసారి ప్రపంచం కళ్లెదుటకు వచ్చేసింది.