గ్రూప్-1 పరీక్షలు అంటేనే తెలుగు రాష్ట్రాల్లో గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రెండుసార్లు రద్దయిన గ్రూప్-1 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిస్థితికి చేరుకుంది. 2018 గ్రూప్-1 పరీక్షపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇంతకుముందే జరిగిన మెయిన్స్(Mains) ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. రద్దు చేసిన పరీక్షల్ని(Exams) తిరిగి నిర్వహించాలంటూ తీర్పులో తెలియజేసింది. ఆన్సర్ పేపర్లు పదే పదే దిద్దడం చట్టవిరుద్ధమన్న న్యాయస్థానం… రెండోసారి, మూడోసారి ఇలా మూల్యాంకనం చేసుకుంటూ పోవడం తప్పుడు చర్యేనని స్పష్టం చేసింది. మెయిన్స్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మాన్యువల్ గానా…
జవాబు పత్రాల(Answer Sheets)ను మాన్యువల్ గా అంటే చేతితో దిద్దడం, అదీ రెండు సార్లు అలాగే చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మొదటిసారి దిద్దిన పేపర్ల రిజల్ట్స్ ను పక్కనపెట్టి రెండోసారి కరెక్షన్ చేసిన తర్వాత నచ్చినవారికి సెలెక్ట్ చేసుకున్నారంటూ కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మరోసారి పరీక్ష నిర్వహించాలని చెప్పడంతోపాటు సెలక్షన్ ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో…
గ్రూప్-1 పరీక్షపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అయోమయం వీడటం లేదు. తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు రద్దయి, మరోసారి నోటిఫికేషన్ నే మార్చేసిన కొత్త సర్కారు.. తాజాగా మరోసారి పరీక్షల్ని నిర్వహించబోతున్నది. ఇక్కడ ఇలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో ఇరు రాష్ట్రాల్లో గ్రూప్-1కు మోక్షమెప్పుడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.