మహిళా సంఘాలకు విరివిగా పథకాలు ప్రకటిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. మరికొన్ని పనుల్ని సైతం వారికే అప్పగిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ బడులకు సంబంధించి యూనిఫామ్స్ తయారీ అంతా మహిళా సంఘాలకు కట్టబెట్టింది. ఇక ప్రభుత్వ పాఠశాలల(Govt Schools) నిర్వహణ బాధ్యతను సైతం స్వయం సహాయక బృందాలు(Self Help Groups) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. స్కూల్ లెవెల్లో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు’ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
నిన్ననే ఒక జీవో…
యూనిఫామ్స్ కుట్టి ఇచ్చి వాటిని సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకు కట్టబెడుతూ నిన్న(ఈనెల 12న) నిర్ణయించి జీవో జారీ చేసిన సర్కారు.. తాజాగా స్కూల్ మేనేజ్మెంట్ విషయంలోనూ అదే తరహా నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్న ప్రభుత్వం.. మహిళా సంఘాల్ని మరింత బలోపేతం(Strengthen) చేసే విధంగా సర్కారీ బళ్ల బాధ్యతల్ని కూడా వారికే అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.