నేటితో ముగిసిపోయిన గ్రూప్-1 దరఖాస్తుల గడువును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పొడిగించింది. మరో రెండు రోజుల పాటు అప్లికేషన్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ప్రకటన ఇచ్చిన కమిషన్.. పాత పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టుల్ని జత చేశారు.
గడువు పెంచాలంటూ అభ్యర్థుల నుంచి పెద్దయెత్తున విజ్ఞప్తులు వచ్చినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TSPSC తెలిపింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈరోజు(మార్చి14)కి అప్లికేషన్ల గడువు ముగిసిపోయినా.. తాజా నిర్ణయం ప్రకారం మరో రెండు రోజులు అంటే ఈనెల 16న సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్(Online) దరఖాస్తులు స్వీకరిస్తారు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, పరీక్షల తేదీల్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఈ మధ్యనే ప్రకటించింది. నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3.. ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తుండగా… అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.