అంతర్గత సమస్యలు బహిర్గతమవడమే కమలం పార్టీలో కలకలం రేపుతున్నాయా…
సీనియర్లు, జూనియర్ల రగడతో… లోలోపలే రాద్ధాంతం జరుగుతోందా…
వచ్చే ఎన్నికల్లో దూకుడు నడుస్తుందా.. బ్యాలెన్సింగ్ మేలు చేస్తుందా…
ఇవన్నీ సామాన్య బీజేపీ కార్యకర్తతోపాటు ప్రజల్లోనూ వినిపిస్తున్న మాటలు.
గత కొద్దిరోజులుగా నెలకొన్న అయోమయానికి తెరదించుతూ రాష్ట్ర BJPకి కొత్త టీమ్ ను ప్రకటించింది హైకమాండ్. ఇంచుమించు రెణ్నెల్లుగా కొనసాగుతున్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పడేలా జాతీయ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అధ్యక్షుడి మార్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది.. వచ్చే ఎన్నికల్లో BRSకు ప్రత్యామ్నాయంగా మారే శక్తి పార్టీకి పెరుగుతుందా… తగ్గుతుందా… అందరిలోనూ ముఖ్యంగా కమలం జెండా మోసే నికార్సయిన కార్యకర్తల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి.
తెలంగాణలో BJPకి ఇప్పటికీ ఆశావహ పరిణామమే ఉంది. అధికారాన్ని అందుకుంటారా లేదా అన్న ప్రశ్న అటుంచితే… గట్టిగా నిలబడే సత్తా ఉందన్నది కాదనలేని సత్యం. 18-40 ఏళ్ల మధ్య గల యూత్ BJPకి అట్రాక్ట్ అవుతున్నారనేది టాక్. కానీ దాన్ని అవకాశంగా మలచుకోలేని నాయకత్వ లోపమే ప్రధాన సమస్య అన్నది సగటు బీజేపీ కార్యకర్త భావన. ఈ విషయంలో అసలు హైకమాండ్ ఏం ఆలోచిస్తుందన్నది BJP కార్యకర్తల్లో అయోమయానికి కారణంగా నిలుస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి… ఈ ఇద్దరూ సీనియర్లే. పార్టీని ఉన్నత స్థితిలో నిలిపినవారే. బండి సంజయ్ దూకుడుకు మారుపేరుగా నిలిస్తే… బ్యాలెన్సింగ్ కు కిషన్ రెడ్డి పెట్టింది పేరు.
తన పదవీకాలంలో పార్టీ పరపతి అమాంతం పెరగడంలో సంజయ్ పాత్ర ఎనలేనిది. దూకుడైన స్ట్రాటజీతో.. యువతను, కొన్ని వర్గాలను బాగా ఆకర్షించగలిగారు. ఏదైనా అనాలనుకుంటే అనేయడమే తప్ప వెనుదిరిగి చూసుకునే అలవాటు లేదు. జూనియర్లకు లీడర్ షిప్ బాధ్యతలు అప్పగించడంలో సంజయ్ ప్రత్యేక దృష్టి పెట్టారని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. కర్ణాటక ఎన్నికల ముందు వరకు BJP హవా మామూలుగా లేదు. అన్ని పార్టీల నుంచి ఇక వలసలే వలసలు అనుకున్నారు. కానీ కర్ణాటక రిజల్ట్స్ చూసిన తర్వాత పరిస్థితిలో అనూహ్య మార్పు. పార్టీలోకి వస్తారనుకుంటే అందులో ఉన్నవారే అయోమయంగా తయారయ్యారు. ఆధిపత్య పోరుతో అంతర్గత విభేదాలు కాస్తా రచ్చకెక్కాయి. సీక్రెట్ మీటింగ్ లు పెడుతూ ఒక గ్రూపుపై మరో గ్రూపు అసంతృప్తిగా ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికలకు ఏమంత టైం లేని ఈ స్థితిలో పార్టీ తీరును చూసి BJP కార్యకర్తలు ఆవేదనకు లోనయ్యారు. BRSకు సవాల్ విసిరే స్థాయి నుంచి బేలగా ఎందుకు మారాల్సి వస్తుందని చర్చలు పెడుతున్నారు. వాస్తవానికి కమలం పార్టీకి ఇప్పటికీ మంచి ప్రజాదరణ కనపడుతోంది. కానీ వాటిని ఓట్లుగా మలచుకునే లీడర్ షిప్ కావాలన్నది సగటు కార్యకర్త అభిలాష.
90కి పైగా సీట్లు వస్తాయని BRS గట్టిగా ప్రకటనలు చేస్తున్న వేళ… BJP సైతం గట్టి పోటీనిస్తుందని ఆర్నెల్ల క్రితం వరకు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మారిన స్ట్రాటజీతో ఒక్కసారిగా పరిణామాలు మారాయి. బండి సంజయ్ లాగే దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి.. PCC ప్రెసిడెంట్ అయ్యాక జోరు పూర్తిగా తగ్గించి ఎప్పుడు ఏం చేయాలో అదే చేసుకుంటూ పోతున్నారు. పొంగులేటి, జూపల్లిని చేర్చుకోగా.. కలిసివచ్చే ఇతర నేతల్ని ఆకర్షించే పనిలో మెల్లమెల్లగా స్టెప్స్ వేస్తున్నారు. తాజాగా ఖమ్మం సభలో రాహుల్ గాంధీ… పింఛన్లను 4 వేలకు పెంచడం, రుణమాఫీ నిర్ణయాలకు వెనుకడుగు వేయకపోవడంతో లబ్ధిదారుల్లో హస్తం పార్టీపై ఆశలు చిగురిస్తున్నట్లే కనపడుతోందన్న చర్చ నడుస్తోంది.
‘B’ టీమ్ అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న మూడు పార్టీల పెద్దలకు… మధ్యప్రదేశ్ ప్రోగ్రాంలో మోదీ మాట్లాడిన తర్వాత ఓ క్లారిటీ వచ్చినట్లే అయింది. కవిత విషయంలో ఉదాసీనంగా ఉంటున్నారని అప్పటిదాకా జరిగిన ప్రచారానికి… ప్రధాని మాటలతో రాష్ట్ర నేతల్లో పూర్తి ధైర్యం వచ్చింది. ఇక ముందడుగే అనే స్థితిలో అధ్యక్షుడి మార్పు ఊహించని పరిణామం. నిజానికి లోక్ సభ ఎన్నికల్లో BJPకి పడే ఓట్ల విషయంలో సందేహాలు లేకున్నా అసెంబ్లీ ఎలక్షన్లలోనే ఓట్లు వస్తాయా అన్న భావన కనపడుతోంది. ‘దీన్ని అనుకూలంగా మలచుకోవాలంటే బూత్ స్థాయిలో శ్రేణుల్ని బలోపేతం చేయాలని… వాస్తవానికి బూత్ లెవెల్లో శ్రేణులు బాగానే ఉన్నారు కానీ… వారిని సమన్వయం చేసుకోవాల్సి ఉందంతే’ అన్న మాటలు వినపడుతున్నాయి. మండల, జిల్లా కమిటీల్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దితే BJPకి తిరుగుండదని ఆ పార్టీ శ్రేణులే అనుకుంటున్నాయి. ఒక్కో సెగ్మెంట్లో పోటీదారులు ముగ్గురు, నలుగురు ఉంటున్నారు. ఇందులో ఎవరితో తిరగాలో కార్యకర్తలకు తలనొప్పిగా తయారైంది. వచ్చే ఎన్నికలకు ఎవరు సరైన వారన్నది ఇప్పుడే ఓ క్లారిటీ ఇస్తే మంచిదన్నది సెగ్మెంట్లలో వినపడుతున్న మాట. కేంద్ర పెద్దలకు ఇక్కడి పరిణామాలు అర్థమవుతున్నాయా లేదా… వారికి గైడ్ చేసేవారు ఉన్నారా అనే సందేహాలు నడుస్తున్న వేళ… పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే అందరూ కలిసికట్టుగా పోరాడితేనే సాధ్యమన్న భావన ఆ పార్టీలోనూ, మద్దతుదారుల్లోనూ కనపడుతోంది.