నూతనం(Newly)గా నియామకమైన ఎన్నికల కమిషనర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు(Interesting Comments) చేసింది. ఎన్నికల కమిషనర్ల(Election Commissioners) రిక్రూట్మెంట్ పై స్టే విధించాలన్న పిటిషన్లు కొట్టివేసింది. ఇద్దరు కమిషనర్ల నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయడాన్ని ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అనవసరం అని అభిప్రాయపడింది. లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా దీనిపై ఇక విచారణ జరపడం అవసరం లేదంటూ అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆరు వారాల్లోగా…
ECల నియామక చట్టం రాజ్యాంగబద్ధత మీద దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం(Top Court) విచారణ చేపట్టింది. ఈ అంశంపై పార్లమెంటు చట్టం చేసిన దృష్ట్యా ఎంపిక ప్రక్రియను మరోసారి జరపాలని ఆదేశించలేమంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రితో కూడిన కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని, అలా చేస్తే ఎన్నికల ప్రక్రియకు భంగం(Disturb) కలిగించనట్లవుతుందని అభిప్రాయపడింది. ఈ కమిటీలో సుప్రీం చీఫ్ జస్టిస్(CJI)ని భాగస్వామిగా చేయాలని ఇదే కోర్టు 2023లో తీర్పునిచ్చింది. కానీ కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టి ఎన్నికల కమిషనర్ల ప్రక్రియకు CJIని దూరంగా ఉంచుతున్నది.
ఇంత స్పీడ్ గానా…
అత్యంత స్పీడ్ గా నియామకాలు చేపట్టడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. షార్ట్ లిస్ట్ విషయంలో సెర్చ్ కమిటీ అంత స్పీడ్ గా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ప్రతి ప్యానల్ మెంబర్ కు తగినంత టైమ్ ఇస్తే బాగుండేదని స్పష్టం చేసింది. తద్వారా షార్ట్ లిస్ట్(Short List)లోని అధికారుల వివరాల్ని పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశం ఉండేదని గుర్తుచేసింది. ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తుది జాబితాలోని అభ్యర్థుల వివరాల్ని సెర్చ్ కమిటీలోని ప్రతిపక్ష నేతకు నాలుగైదు రోజుల ముందుగానే ఇవ్వకపోవడాన్ని ఉదహరించింది. కొత్త కమిషనర్ల నియామక చట్టబద్ధతపై తాము ప్రశ్నలు వేయాలనుకోవడం లేదన్న బెంచ్.. సెలక్షన్ ప్రొసీజరే వేగంగా జరగడం సరికాదని పేర్కొంటూ అన్ని పిటిషన్లను కొట్టివేసింది.