బెయిల్ కోసం కేజ్రీవాల్ పిటిషన్ వేయడం..
తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ED కోరడం..
అరెస్టయిన CMను ఆ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలంటూ కేసు దాఖలు కావడం…
వంటి పరిణామాలతో అసలు చట్టాలు ఏం చెబుతున్నాయనే దానిపై సందిగ్ధం ఏర్పడింది.
ED కస్టడీకి…
మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తమ కస్టడీ(Custody)కి అప్పగించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై రెండున్నర గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిగింది. ఆయన్ను 10 రోజుల పాటు అప్పగించాలంటూ ED కోరితే ఆరు రోజుల కస్టడీకి అప్పగించింది. దీంతో ఈనెల 28 వరకు ఢిల్లీ CM.. అధికారుల కస్టడీలో ఉండనున్నారు.
ప్రత్యేక చట్టమేమీ…
కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా అక్కణ్నుంచే ఢిల్లీ CMగా పాలన సాగిస్తారని ఇంతకుముందే ‘ఆప్’ నేతలు చెప్పారు. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ నిపుణులు(Legal Experts) చెప్పే విషయాలు కీలకంగా మారాయి. అరెస్టయిన వ్యక్తి కారాగారం నుంచే పరిపాలన సాగించాలా, వద్దా అన్న దానిపై దేశంలో ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు లేవట. ఈ పరిస్థితి ఇంతకుముందెన్నడూ ఎదురుకాలేదని చెబుతున్నారు. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు కోర్టు ఇచ్చిన తీర్పుతో జైలుకు వెళ్లారు. ఆ సమయంలో సీఎంగా వైదొలిగారు.
కేజ్రీవాల్ భిన్నమేనా…
కానీ ఇప్పుడు కేజ్రీవాల్ అలాంటి నిర్ణయమేదీ తీసుకోకపోవడం, నంబర్-2 అయిన మనీశ్ సిసోడియా సైతం జైలులోనే ఉండటంతో ఆప్ ప్రత్యామ్నాయ(Alternative) సీఎం ఎవరనేది క్వశ్చన్ మార్క్ గా తయారైంది. కేజ్రీవాల్ ఇప్పటివరకైతే రాజీనామా చేయలేదు. అరెస్టయిన వ్యక్తి పాలన సాగించడాన్ని అడ్డుకోవడానికి న్యాయసూత్రాల్లో ఎలాంటి అంశాలు లేవని(No Bar In Law) సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకరనారాయణ్ అభిప్రాయపడ్డారు.
కటకటాల వెనుక ఉంటూ పరిపాలన సాగించడమనేది కష్టసాధ్యమే అయినా దాన్ని నిరోధించడానికున్న అవకాశాలు మాత్రం లేవని మరో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఎలా యంత్రాంగాన్ని నడిపిస్తారన్నది ఆశ్చర్యకరంగా తయారైందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.