బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. ఇప్పటికే ED కస్టడీలో ఉన్న ఆమెను మరో మూడు రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. కవితను ఇంకా విచారించాల్సి ఉందంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో CBI ప్రత్యేక న్యాయస్థానంలో ED తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. కనీసం ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరడంతో… మూడు రోజుల పాటు అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
వారం రోజులు ముగిసినా…
కవితను ఇప్పటికే వారం రోజుల పాటు విచారించిన ED.. ఈరోజు మరోసారి ఆమెను కోర్టుకు తీసుకువచ్చారు. విచారణకు కవిత ఏ మాత్రం సహకరించడం లేదని, కుటుంబ ఆదాయ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వనందున ఆమెను ప్రశ్నించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. గతంలో అరెస్టు చేసిన సమీర్ మహేంద్రతోపాటు మరో ఇద్దరు ముగ్గురితో కలిపి విచారణ నిర్వహించాల్సి ఉందని ED అడ్వొకేట్లు కోరారు. అయితే ఈడీ వాదనల్ని కవిత లాయర్లు వ్యతిరేకిస్తూ కస్టడీకి ఇవ్వొద్దని కోరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున కస్టడీ కొనసాగించవద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
వాదనల తర్వాత…
ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత CBI స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. ఆ తర్వాత ఆమెను కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. కోర్టుకు వస్తున్న సమయంలో కంటపడ్డ మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. ఇందులో కొత్తేమీ లేదని, ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అంటూ లోపలికి వెళ్లిపోయారు.