4.4 ఓవర్లలో 50 పరుగులు… 6.6 ఓవర్లలో 100 స్కోరు… అంటే ఫిఫ్టీ నుంచి ఇంకో ఫిఫ్టీ చేరుకోవడానికి పట్టిన బంతులు కేవలం 12. ఇక 14.4 ఓవర్లలోనే స్కోరు బోర్డుపై దర్శనమిచ్చింది 200 స్కోరు. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు హైదరాబాద్ సన్ రైజర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మార్ క్రమ్ పించ్ హిట్టింగ్ తో ముంబయి బౌలర్లంతా బిత్తరపోయారు.
తేలిపోయిన బౌలర్లు…
టాప్ బౌలర్లైన బుమ్రా, కోయెట్జీ చేతులెత్తేయాల్సి వచ్చింది. క్వెనా మఫకా 4 ఓవర్లలో 16.50 ఎకానమీతో 66, గెరాల్డ్ కోయెట్జీ 4 ఓవర్లలో 14.25 ఎకానమీతో 57, హార్దిక్ పాండ్య 4 ఓవర్లలో 11.50 ఎకానమీతో 46, బుమ్రా 4 ఓవర్లలో 9 ఎకానమీతో 36 రన్స్ ఇచ్చారంటే హైదరాబాద్ బ్యాటర్ల బాదుడు అర్థమవుతుంది.
వెంట వెంటనే బద్ధలు…
సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. అందులో 9 ఫోర్లుంటే 2 సిక్స్ లున్నాయి. అంటే ఫోర్లు, సిక్స్ లు ద్వారానే 48 రన్స్ వచ్చాయి. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ రికార్డు బద్ధలైంది. వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ శర్మ కేవలం 16 బాల్స్ లోనే 50 పూర్తి చేసుకున్నాడు. అతడి హాఫ్ సెంచరీలో 2 ఫోర్లు, 6 సిక్స్ లున్నాయి. అంటే 44 పరుగులు ఫోర్లు, సిక్స్ ల ద్వారా వచ్చినవే. ఇలా కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బద్ధలు కావడం, ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదటంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది.