భారీ టార్గెట్(Target)తో బరిలోకి దిగిన జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించినా శిఖర్ ధావన్ మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్ నవూ సూపర్ జెయింట్స్.. 8 వికెట్లకు 199 పరుగులు చేసింది. 200 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆఖర్లో తడబడి కంటిన్యూగా వికెట్లు చేజార్చుకుంది. చివరకు 5 వికెట్లకు 178 పరుగులకే పరిమితమై 21 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
ఆ ముగ్గురితో…
ఒకవైపు డికాక్(54; 38 బంతుల్లో 5×4, 2×6) హిట్టింగ్ చేస్తున్నా మరో ఎండ్ లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. కేఎల్ రాహుల్(15), దేవ్ దత్ పడిక్కల్(9), మార్కస్ స్టాయినిస్(19) తక్కువ స్కోరుకే వికెట్లు చేజార్చుకున్నారు. కానీ కెప్టెన్ పూరన్(42; 21 బంతుల్లో 3×4, 3×6) క్రీజులో కుదురుకోవడంతో పరుగుల వేగం పెరిగింది.
200 స్ట్రైక్ రేట్(Strike Rate)తో ధాటిగా సాగుతూ హాఫ్ సెంచరీకి దగ్గరైన పూరన్ ను రబాడ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్య(43; 22 బంతుల్లో 4×4, 2×6) మరింతగా రెచ్చిపోయాడు. వరుస బాల్స్ లో బదోని(8), రవి బిష్ణోయ్(0) వెనుదిరిగినా కృణాల్ బాదుడు ఆగలేదు.
శిఖర్ ధనాధన్…
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు శిఖర్ ధావన్(70; 50 బంతుల్లో 7×4, 3×6), బెయిర్ స్టో జోడీ ఫస్ట్ వికెట్ కు 102 రన్స్ జత చేసింది. బెయిర్ స్టో(42; 29 బంతుల్లో 3×4, 3×6), ప్రభ్ సిమ్రన్(19; 7 బంతుల్లో 1×4, 2×6) ధాటిగా ఆడారు. కానీ ప్రభ్ తోపాటు జితేష్ శర్మ(6), శామ్ కరణ్(0) వెంటవెంటనే వికెట్లు పోగొట్టుకున్నారు. ఇక ధావన్ కూడా ఔటవడంతో 141కి చేరుకునేసరికి పంజాబ్ 5 వికెట్లు కోల్పోయింది.