ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ముంబయి ఇండియన్స్(Mumbai Indians)కి ముచ్చెమటలు పట్టించారు రాజస్థాన్ బౌలర్లు. కుదురుకునేలోపే నలుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఔటైతే అందులో ముగ్గురివి డకౌట్లే. 3.3 ఓవర్లలో 20 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబయికి ఆరంభంలోనే ఇలా కోలుకోలేని దెబ్బ తగిలింది. తొలి ఓవర్ ఐదో బంతికి రోహిత్(0), చివరి బాల్ కు నమన్ ధిర్(0) సైతం ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు.
హార్దిక్ కూడా…
ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్(0), ఇషాన్ కిషన్(16) వికెట్లు సమర్పించుకున్నారు. ఇక మిగిలింది కేవలం ఇద్దరే మెయిన్ బ్యాటర్లు హార్దిక్, తిలక్ వర్మ. నిలదొక్కుకుని ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్య(34) చాహల్ బౌలింగ్ లో షాట్ కు యత్నించి ఔటయ్యాడు. హార్దిక్, తిలక్ జోడీ ఐదో వికెట్ కు 56 పరుగుల పార్ట్నర్ షిప్ జత చేసింది. పీయూష్ చావ్లా(3) సైతం అదే దారి పట్టాడు.
సగం ఓవర్లకే…
సగం ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి 83 స్కోరుకే 6 వికెట్లు పోగొట్టుకుంది. చివరకు తిలక్ వర్మ(32) సైతం ఔటవడంతో ఆ జట్టు కథ క్లోజ్ అయింది. లెగ్ స్పిన్నర్ చావ్లా రెండు కీలక వికెట్లు(హార్దిక్, తిలక్) తీసి ముంబయి పతనాన్ని శాసించాడు. దీంతో ఓవర్లు ముగిసేసరికి ఆ టీమ్ 9 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసి స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది.