మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లో ఈ మధ్యకాలంలో జరిగిన మూడో ఎన్ కౌంటర్(Maoists Encounter) ఇది. నిన్న బీజాపూర్ జిల్లాలోని బస్తర్ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మృతదేహాల్ని పోలీసులు గుర్తించారు. అందులో ఒకరు మహిళ ఉండగా.. చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరిపై రూ.43 లక్షల రివార్డు ఉంది.
భారీగా ఆయుధాలు…
లైట్ మెషిన్ గన్, ఏకే-47లు, భారీస్థాయిలో గ్రనేడ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం(Recovery) చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు గుర్తించారు. ఛత్తీస్ గఢ్ లో 2023 డిసెంబరులో విష్ణుదేవ్ సాయ్(Vishnu Deo Sai) నేతృత్వంలో BJP సర్కారు కొలువుదీరిన తర్వాత మొత్తం 47 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారు.
తెలంగాణ బోర్డర్…
తెలంగాణ సరిహద్దు(Border)లోని గంగలూరు ప్రాంతంలో 100 మంది మావోయిస్టులున్నారన్న సమాచారంతో కోబ్రా(CoBRA) కమాండోలు, CRPF, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ దళాలు జల్లెడ పట్టాయి. లెండ్రా-కొర్చోలి గ్రామాల మధ్య మావోయిస్టులు కనిపించడంతో ఇరువర్గాల మధ్య మంగళవారం పొద్దున 6 గంటలకు కాల్పులు(Gunfight) మొదలయ్యాయి. నిన్న 10 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ IG పి.సుందర్ రాజ్ తెలిపారు.
మధ్యప్రదేశ్ లోనూ…
మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలోని కేరాఝరి ఫారెస్ట్ లో సోమవారం రాత్రి 9 గంటలకు జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో డివిజనల్ కమిటీ మెంబర్ అయిన 38 ఏళ్ల సాజంతి అలియాస్ క్రాంతితోపాటు ఏరియా కమిటీ మెంబర్ 54 ఏళ్ల రఘు అలియాస్ షేర్ సింగ్ మృతిచెందారు. హత్యలు, కిడ్నాప్ కేసుల్లో ఈ ఇద్దరూ నిందితులు కాగా, వీరికోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు.