కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. తొలుత సునీల్ నరైన్, ఆ తర్వాత రఘువన్షీ, అనంతరం అండ్రీ రసెల్ ఫటఫటలాడించారు. ఎటువైపు బాల్ వేసిన ఫోర్, సిక్స్ అన్నట్లుగా సాగింది KKR బ్యాటర్ల విధ్వంసం. కొద్దిలో సెంచరీ కోల్పోయాడు కానీ అతడి ఊపు చూస్తే మరిన్ని రికార్డులు బద్ధలవడం ఖాయమనిపించింది.
నరైన్(85; 39 బంతుల్లో 7×4, 7×6) ధాటికి ఢిల్లీ బౌలర్లు గల్లీ క్రికెటర్లలా మారిపోయారు. 7 వికెట్లకు 272 పరుగుల భారీ స్కోరు చేసింది KKR. కొద్దిలో తప్పిపోయింది కానీ హైదరాబాద్ మొన్న నెలకొల్పిన 277 పరుగుల రికార్డు బద్ధలయ్యేదే. టాటా IPLలో రెండో అత్యధిక స్కోరు రికార్డును రాసుకుంది కోల్ కతా.
44 బాల్స్ లోనే 100
మరో ఎండ్ లో అంగ్ క్రిష్ రఘువన్షీ(54; 27 బంతుల్లో 5×4, 3×6) సైతం 25 బంతుల్లోనే ఫిఫ్టీ(50) పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మరో సునామీ మొదలైంది. రసెల్(41; 19 బంతుల్లో 4×4, 3×6), రింకూ సింగ్(26; 8 బంతుల్లో 1×4, 3×6) హిట్టింగ్ కు దిగారు. నరైన్, రఘువన్షీ జోడీ కేవలం 44 బంతుల్లోనే 100 పరుగులు చేసింది.
నరైన్ 21 బంతుల్లో ఫిఫ్టీ చేరుకుంటే రఘువన్షీకి 25 బాల్స్ పట్టాయి. తొలి 10 ఓవర్లలో హైదరాబాద్ సన్ రైజర్స్ 148 పరుగులు చేస్తే, ముంబయి ఇండియన్స్ 141 చేసింది. ఆ తర్వాతి స్థానంలో 135 స్కోరుతో కోల్ కతా మూడో స్థానం(Third Place)లో ఉంది.