దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన ‘సందేశ్ ఖాలీ’ అరాచకాలపై హైకోర్టు(High Court) సీరియస్ అయింది. వెంటనే అక్కడ విచారణ చేపట్టాలంటూ CBIకి ఆదేశాలిచ్చింది. మహిళలపై ఆకృత్యాలు, హింస, ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ నిర్వహించి నివేదిక(Report) అందజేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారం మొత్తాన్ని తామే పర్యవేక్షిస్తా(Monitoring)మని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే…
మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపుల(Sexual Abuse)కు పాల్పడుతున్నారన్న వార్తలతో రెండు నెలలుగా పశ్చిమబెంగాల్ ఉత్తర 24 పరగణ జిల్లాలోని ‘సందేశ్ ఖాలీ’ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్(TMC) నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా వారి భూముల్ని బలవంతంగా లాక్కున్నట్లు వివాదం చెలరేగింది. దీంతో అక్కడి అకృత్యాలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది.
బాధితురాలే అభ్యర్థి…
ఇంతకుముందే ఈ కేసులో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే ‘సందేశ్ ఖాలీ’ ఉద్యమానికి నేతృత్వం వహించిన బాధితురాలు రేఖ పత్రాను అక్కడి లోక్ సభ నియోజకవర్గమైన ‘బసిర్ హట్’ అభ్యర్థిగా పోటీలో BJP నిలిపింది. ఈ సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం TMC నేత నుస్రత్ జహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు కుదరడం లేదంటూ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటానని నుస్రత్ జహాన్ చెప్పడం, ఆమెను కాదని వేరే వ్యక్తికి TMC టికెట్ దక్కడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు CBI విచారణకు హైకోర్టు ఆదేశించడంతో బాధితులకు ఓదార్పు లభించినట్లయింది.