రియాన్ పరాగ్, కెప్టెన్ సంజూ శాంసన్ ఫటాఫట్ ఇన్నింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్(RR) జోరు చూపించింది. ఇప్పటికే ఓటములు లేకుండా ముందుకు సాగుతున్న రాజస్థాన్.. గుజరాత్ పైనా అదే పోరాటం ప్రదర్శించింది. 42 స్కోరుకే ఓపెనర్లిద్దరూ ఔటైనా ఈ ఇద్దరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. దీంతో రాజస్థాన్ 3 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు చేసింది.
జోడీ జోరు…
ఈ సీజన్లో పెద్దగా ఫామ్ లో లేని జైస్వాల్(24), బట్లర్(8) మరోసారి అలాగే ఆడారు. శాంసన్(68 నాటౌట్; 38 బంతుల్లో 7×4, 2×6), పరాగ్(76; 48 బంతుల్లో 3×4, 5×6) జోడీ ఇన్నింగ్స్ ను నిర్మిస్తూ ముందుకు సాగింది. తొలుత మెల్ల(Slow)గా ఆడి తర్వాత దూకుడు పెంచింది. 7.3 ఓవర్లలో 50 దాటిన రాయల్స్.. 100 మార్క్ ను 12.4 ఓవర్లలోనే అందుకుంది.
హాఫ్ సెంచరీలు…
పరాగ్ 34 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో ఫిఫ్టీ పూర్తి చేస్తే.. శాంసన్ 31 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 64 బాల్స్ లో 100 పరుగుల పార్ట్నర్ షిప్ ఇచ్చారు. మొత్తంగా శాంసన్, పరాగ్ జంట 132 పరుగులు జత చేయడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ వేగంగా సాగింది.