యోగా గురువు రాందేవ్ బాబాతోపాటు ఆయన సంస్థ పతంజలిపై సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సీరియస్ అయింది. తాము తీసుకోబోయే చర్యల(Action)కు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. బేషరతుగా చెప్పిన క్షమాపణ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం.. రాందేవ్ బాబా, పతంజలి వ్యవహారశైలి క్షమించరానిదని స్పష్టం చేసింది.
మోసపూరితంగా…
ఆరోగ్య రక్షణకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు(Ads) ఇస్తున్నారంటూ ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మోసపూరిత ప్రకటనలపై పతంజలి మీద గతంలోనే ఫిర్యాదులు(Complaints) వచ్చాయి. అలాంటివి ఇవ్వబోమంటూ గత విచారణ(Hearing) సందర్భంగా పతంజలి హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన మాటను ధిక్కరించి ప్రకటనలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారని కోర్టు గుర్తించింది. చట్టాలను రాందేవ్, బాలకృష్ణ ఉల్లంఘించారని జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్(Devision Bench) అభిప్రాయపడింది. దీనిపై ఫిబ్రవరి 27న ఈ ఇద్దరిపై ధిక్కరణ నోటీసు జారీ అయింది.
అటెండ్ కావాలంటూ…
అస్తమా, గుండె జబ్బుల వంటి వ్యాధుల్ని పూర్తిగా నయం చేస్తామంటూ ఆధారాలు లేని వాదనలు చేస్తున్నారని పతంజలిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాధులకు సంబంధించిన మందుల(Medicine) గురించి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఆయుర్వేద యాడ్స్ పై 2023 నవంబరులోనూ సుప్రీం మండిపడింది. అయితే కేవలం క్షమాపణ చెప్పి రాందేవ్, బాలకృష్ణ తప్పించుకోలేరని ఘాటైన కామెంట్స్ చేసింది. సమాజాన్ని మోసం చేసినట్లు కోర్టును తప్పుదోవ పట్టించలేరని గుర్తు చేసింది. కోర్డు ఆదేశాల్ని పట్టించుకోకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడబోతున్నారంటూ స్పష్టం చేసింది. చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చూపిన ఉత్తరాఖండ్ సర్కారుపైనా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.