భారతదేశ సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) అంటేనే కంపెనీ పనితీరు, విలువలు గుర్తుకు వస్తాయి. లాభాలే కాదు.. ఉద్యోగుల సంక్షేమం, సమాజ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ పనిచేస్తుంటుంది. టాటా గ్రూపులో భాగమైన TCS భారీస్థాయిలో లాభాలు మూటగట్టుకుంది. 2023-2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సర(Financial Year) చివరి త్రైమాసికానికి లాభాలు పొందినట్లు సంస్థ తెలిపింది. పన్నుల చెల్లింపు తర్వాత(Profit After Tax) రూ.12,434 కోట్ల మేర లాభాలు అందుకుంది.
పురోగతి అలా…
ఈ లాభాలు గత ఆర్థిక సంవత్సరం(2022-2023)తో పోల్చుకుంటే(Calculate) 9.1 శాతం ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ రెవెన్యూ రూ.61,237 కోట్లు కాగా, ప్రతి సంవత్సరం 3.5% వృద్ధి సాధిస్తున్నట్లు TCS ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి పొందిన లాభం 37.9% కాగా, ఇంగ్లండ్ నుంచి 6.2%, ఇక తయారీ రంగం(Manufacturing) నుంచి ఇంకో 9.7% శాతంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ స్థాయిలో లాభాలు వచ్చినా కంపెనీ ఊహించిన మేరకు ప్రాఫిట్స్ లేనట్లేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
డీల్స్ ఇలా…
మార్చి 31తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ కు గాను రికార్డు స్థాయిలో 42.7 బిలియన్ డాలర్ల(రూ.3,62,950 కోట్లు) డీల్స్(Deals) కుదుర్చుకోగా, చివరి మూణ్నెల్లకు గాను 13.2 బిలియన్ డాలర్ల(రూ.1,12,200 కోట్లు) డీల్స్ తో ముగించింది. అటు కంపెనీ షేర్లు గతేడాదితో పోలిస్తే 6% మేర వృద్ధిని నమోదు చేశాయి. ఇది కంపెనీ అభివృద్ధికి అద్దం పడుతుందని CEO కె.కృతివాసన్ ఆనందంతో చెబుతున్నారు.